Eknath Shinde: ఆర్మీలో అవకాశాన్ని చేజార్చుకున్నా.. అయితేనేం శివ‘సైనికుడి’నయ్యా!

ఇండియన్‌ ఆర్మీకి ఎంపికైనప్పటికీ.. శిక్షణకు హాజరయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నానని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అయితేనేం, శివ‘సైనికుడి’గా మారానని తెలిపారు.

Updated : 06 May 2023 18:31 IST

ముంబయి: ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray)పై తిరుగుబాటు, తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి భాజపా (BJP)తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వంటి మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ పరిణామాల్లో ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్‌ శిందే.. తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను తాజాగా ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ రోజు తన ప్రయాణ ప్రణాళికను మధ్యలోనే మార్చుకోకుంటే ఇప్పుడు భారత సైన్యం (Indian Army)లో ఉండేవాడినని అన్నారు. అయితే, తన నిర్ణయం పట్ల చింతించడం లేదని తెలిపారు.

‘నేను ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యా. లఖ్‌నవూలో శిక్షణ కోసం బయల్దేరా. అయితే, హరియాణాలోని రోహ్‌తక్‌లో స్నేహితుడి వివాహం ఉందన్న విషయం మార్గమధ్యలో గుర్తొచ్చింది. దీంతో రూట్ మార్చుకుని దిల్లీ నుంచి రోహ్‌తక్ చేరుకున్నా. మూడు నాలుగు రోజుల తర్వాత లఖ్‌నవూ వెళ్లా. అయితే, ప్రస్తుతానికి అవకాశం చేజారిందని, శిక్షణ కోసం కొత్త వారంట్‌తో తిరిగి రావాలని అక్కడి అధికారులు సూచించారు. దీంతో ముంబయికి తిరిగి వచ్చా. ఆ సమయంలో ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. తదనంతరం ఆ విషయాన్ని అలాగే వదిలేసి రాజకీయాల్లో సక్సెస్ అయ్యా’ అని శిందే తన జ్ఞాపకాలను పంచుకున్నారు. తాను ఆర్మీలో చేరలేదని, అయితేనేం శివ‘సైనికుడి’గా మారానని పేర్కొన్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి పెళ్లికి హాజరైనందుకు రోహ్‌తక్‌లో ఓ అతిథి తనను అభినందించారని సీఎం శిందే గుర్తు చేసుకున్నారు. ‘ఇప్పటికీ నా మాటను నిలబెట్టుకుంటా. నా జీవన విధానంలో అది కనిపిస్తుంది’ అని తెలిపారు. సామాజిక సేవ, రాజకీయాల్లో బిజీ షెడ్యూల్ కారణంగా తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని శిందే తెలిపారు. తన భార్యే కుటుంబ బాగోగులు చూసుకునేదని, కుమారుడు శ్రీకాంత్ శిందే వైద్యుడిగా, రాజకీయవేత్తగా ఎదగడం వెనుక ఆమె ప్రోత్సాహం ఉందని చెప్పారు. శ్రీకాంత్ శిందే ప్రస్తుతం కల్యాణ్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని