Anand Mahindra: రక్షణ బడ్జెట్‌ను పెంచిన చైనా.. కీలక వ్యాఖ్యలు చేసిన మహీంద్రా..!

ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకరపోరు సాగుతోన్న వేళ.. చైనా రక్షణ బడ్జెట్‌ను గణనీయంగా పెంచింది. భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొని ఉన్న సమయంలో ఈ కేటాయింపులు కలవరానికి గురిచేస్తున్నాయి.

Published : 10 Mar 2022 01:49 IST

ముంబయి: ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకరపోరు సాగుతోన్న వేళ.. చైనా రక్షణ బడ్జెట్‌ను గణనీయంగా పెంచింది. భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొని ఉన్న సమయంలో ఈ కేటాయింపులు కలవరానికి గురిచేస్తున్నాయి. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ పరిమాణంతో పట్టింపు లేదని, ఆ కేటాయింపుల్ని ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యమని అన్నారు.

‘బడ్జెట్ ఎంత భారీ స్థాయిలో ఉందన్నది ముఖ్యం కాదు. మున్ముందు యుద్ధరీతులు భిన్నంగా ఉంటాయి. ఉక్రెయిన్‌లో డ్రోన్లు.. యుద్ధ ట్యాంకుల్ని ధ్వంసం చేస్తున్నాయి. మనం ఎంత ఖర్చు చేస్తున్నామనేదాని కంటే ఎంత తెలివిగా ఖర్చు చేస్తున్నామన్నదే ఇక్కడ ముఖ్యం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. రష్యా సైనికి శక్తి ముందు ఉక్రెయిన్ నిలవలేదని ప్రపంచమంతా భావించగా.. అందుకు భిన్నమైన రీతిలో అక్కడ పోరు సాగుతోంది. విమాన విధ్వంసక, ట్యాంక్‌ విధ్వంసక ఆయుధాలను ఉపయోగిస్తూ ఉక్రెయిన్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. 

ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం వార్షిక రక్షణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన చైనా.. కేటాయింపుల్ని గణనీయంగా పెంచింది. క్రితం ఏడాదితో పోలిస్తే 7.1 శాతం నిధుల్ని పెంచి 230 బిలియన్‌ డాలర్లు కేటాయించింది. భారత రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న చైనా.. ఈ స్థాయిలో కేటాయింపుల్ని పెంచడం గమనార్హం. 2012లో చైనా అధ్యక్ష పగ్గాలు షీ జిన్‌పింగ్‌ స్వీకరించిన తర్వాత రక్షణశాఖకు భారీ ఎత్తున నిధుల్ని పెంచుతూ వస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మిలిటరీ వ్యవస్థను అన్ని రంగాల్లో ఆధునికీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సైన్యాన్ని తగ్గించి నావికాదళం, వాయుసేన ప్రాధాన్యాన్ని పెంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని