Published : 26 Aug 2021 01:25 IST

Malala: ‘తాలిబన్లు కాల్చిన ఆ ఒక్క బులెట్‌.. 9 ఏళ్లయినా మానని గాయం..!’

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘తాలిబన్లు నాపై కాల్పులు జరిపి 9ఏళ్లు అయినా.. ఆ ఒక్క బులెట్‌ గాయం నుంచి నేనింకా కోలుకోలేకపోతున్నా. కానీ, గత నాలుగు దశాబ్దాలుగా అఫ్గాన్‌ ప్రజలు లక్షల కొద్దీ బులెట్లను ఎదుర్కొంటున్నారు. నేటికీ వారి వేదన అరణ్య రోదనే’’ అంటూ అఫ్గానిస్థాన్‌ పౌరుల దుస్థితిపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు అఫ్గాన్‌లో తొలి ప్రావిన్స్‌ను ఆక్రమించుకున్న సమయంలో మలాలాకు సర్జరీ జరిగింది. ఆ ఆపరేషన్‌ నుంచి ఇటీవలే కోలుకున్న ఆమె.. ప్రస్తుత అఫ్గాన్‌ పరిస్థితులపై స్పందిస్తూ తాలిబన్ల కారణంగా తాను అనుభవిస్తున్న గాయాలను పంచుకున్నారు. అది మలాలా మాటల్లోనే..

‘‘రెండు వారాల క్రితం అఫ్గాన్‌ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తీసుకుంటున్న సమయంలో నాకు బోస్టన్‌లో ఆరో శస్త్రచికిత్స జరిగింది. తాలిబన్ల వల్ల నా శరీరానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు డాక్టర్లు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అది 2012 అక్టోబరు. పాకిస్థానీ తాలిబన్లు నా స్కూల్‌ బస్సులోకి చొరబడి నా ఎడమ కణతిపై తుపాకీతో కాల్చారు. ఆ ఒక్క బుల్లెట్‌ నా ఎడమ కంటిని, నా మెదడును తినేసింది. నా ముఖ నరాలను దెబ్బతీసింది. చెవిని, దవడను విరగ్గొట్టింది. సమయానికి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెషావర్‌ డాక్టర్లు నా ఎడమ కణతి వద్ద పుర్రెలో కొంత భాగాన్ని తొలగించారు. దాన్ని వల్లే నా ప్రాణాలు నిలిచాయి. అయితే ఆ తర్వాత మిగతా అవయవాలు పనిచేయకపోవడంతో నన్ను చికిత్స నిమిత్తం మరో దేశానికి తీసుకొచ్చారు. ఇది జరిగినప్పుడు నేను కోమాలో ఉన్నాను. తాలిబన్లు వచ్చి నన్ను కాల్చినంత వరకే గుర్తుంది. ఆ తర్వాత నేను కళ్లు తెరిచి చూసేసరికి యూకేలోని క్వీన్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రిలో ఉన్నాను. నేను బతికానంటే నాకే నమ్మబుద్ధికాలేదు.’’

‘‘కళ్లు తెరిచిన తర్వాత నా చుట్టూ అంతా ఇంగ్లీష్‌ మాట్లాడుతున్నారు. నాకు ఏం జరిగింది? మా నాన్న ఎక్కడ ఉన్నారు? నా చికిత్సకు డబ్బులు ఎవరు కడుతున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను సతమతం చేశాయి. కానీ నేను మాట్లాడలేకపోయా. కంటిచూపు కూడా సరిగ్గా లేదు. కొద్ది రోజుల తర్వాత నన్ను నేను అద్దంలో చూసుకుని షాక్‌ అయ్యా. ఒక కన్ను నల్లగా, సగం గుండుతో కన్పించా. తాలిబన్లు నాకు గుండు గీయించారని అనుకున్నా. కానీ సర్జరీ కోసం డాక్టర్లు షేవ్‌ చేశారని చెప్పారు. ఒక రోజు నా పొట్టను తడుముకుంటే గట్టిగా తగిలింది. నా పొట్టకు ఏమైందని నర్సును అడిగాను. పాకిస్థాన్‌లో ఆపరేషన్‌ చేసినప్పుడు పుర్రె ఎముకలో కొంతభాగాన్ని తీసి కడుపులో దాచారని, మరో సర్జరీ చేసిన దాన్ని తలలో అమర్చాలని చెప్పారు. అయితే యూకే వైద్యులు నా పుర్రె ఎముక స్థానంలో టైటానియం ప్లేట్‌ను అమర్చారు. కడుపులో ఉన్న ఎముక భాగాన్ని బయటకు తీశారు. ఇప్పటికీ ఆ భాగం మా ఇంట్లో బుక్‌ షెల్ఫ్‌లో ఉంది’’

‘‘కొన్నాళ్లు నా కుటుంబం కూడా యూకేకు వచ్చింది. ఆ తర్వాత నాకు ఫిజికల్‌ థెరపీ మొదలుపెట్టారు. మెల్లిగా నడవడం, చిన్నగా మాట్లాడటం మొదలుపెట్టా. అదంతా మరో జన్మ ఎత్తినట్లుగా అన్పించేది. బులెట్‌ గాయం కారణంగా ముఖానికి పాక్షికంగా పక్షవాతం వచ్చింది. దీంతో వైద్యులు మరో ఆపరేషన్‌ చేశారు. నరానికి సర్జరీ చేసి ముఖాన్ని ఓ రూపు తీసుకొచ్చారు. ఇప్పటికీ నేను నవ్వితే నా గాయాలు కన్పిస్తాయి. అందుకే నవ్వినప్పుడు నా నోటికి కవర్‌ చేసుకుంటున్నా. అయితే వీటన్నింటి వల్ల నేను బాధపడలేదు. వాస్తవాన్ని అంగీకరించా. ఆత్మవిశ్వాసంతో ఉన్నా. అద్దంలో నా ముఖం చూసుకోకుండా నేను బాగున్నాను అనుకునేదాన్ని. 2018, 2019లో మరో రెండు సర్జరీలు చేశారు. అయితే చివరిసారి చేసినప్పుడు నా చెంప, దవడ భాగం ఉబ్బిపోయాయి. దీంతో మరో ఆపరేషన్‌ చేయాలన్నారు’’

‘‘ఆగస్టు 9న ఆసుపత్రికి వెళ్లేందుకు బయల్దేరుతుంటే తాలిబన్ల వార్త తెలిసింది. కొద్ది రోజుల తర్వాత ఒక్కో ప్రావిన్స్‌ తాలిబన్ల వశమైందని తెలిసింది. నేను కోలుకోగానే మొదట చేసిన పని.. దేశాధినేతలు, మహిళా హక్కుల కార్యకర్తలకు ఫోన్‌ చేయడం. బాలికా విద్యపై అతివాదులు నిషేధం విధించడానికి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నానని తెలిసి నాపై తాలిబన్లు కాల్పలు జరిపారు. ఆ నాడు ఆ ఘటనను పాకిస్థాన్‌ జర్నలిస్టులు, కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు నా గురించి తెలుసుకుని కథనాలు రాశాయి. వాటివల్లే అంతర్జాతీయ సమాజం స్పందించింది. నాకు ఎంతో మంది అండగా నిలిచారు. వారివల్లే నాకు విదేశాల్లో చికిత్స అందింది. లేదంటే ‘‘15ఏళ్ల బాలికపై కాల్పులు’’ హెడ్‌లైన్‌తో నా కథ స్థానికంగానే ముగిసేది. నేను బతికుండేదాన్నే కాదు. ఇప్పుడు అఫ్గాన్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. ముష్కరుల తుపాకీ గుండ్ల నుంచి వారిని కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం కలిసిరావాలి’’ అంటూ మలాలా పోడియంలో రాసుకొచ్చారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని