‘నీతీశ్‌ ఆహారంలో ఏదో కలుపుతున్నారు.. అందుకే అలాంటి మాటలు’: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ(Jitan Ram Manjhi).. ప్రస్తుత ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar)ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీతీశ్‌ తినే ఆహారంపై దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు.

Published : 10 Nov 2023 18:15 IST

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar)ను పదవి నుంచి దింపేందుకు కుట్ర జరుగుతోందట. ఆయన ఆహారంలో విషపూరిత పదార్థాలు కలుపుతున్నారట. హిందుస్థాన్‌ అవామ్ మోర్చా(HAM-S) చీఫ్, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జీతన్‌ రామ్ మాంఝీ(Jitan Ram Manjhi) ఈ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘కొద్దిరోజుల క్రితం నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar) అసెంబ్లీలో అసభ్య పదజాలం ఉపయోగించారు. ఆ మాటల వల్ల ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నిన్న కూడా ఆయన నియంత్రణ కోల్పోయి నా గురించి అవమానకరంగా మాట్లాడారు. నేను ఆయన కంటే అనుభవంపరంగా, వయసులోనూ పెద్దవాడిని అనే విషయాన్ని మర్చిపోయారు. ఆయన మానసిక ఆరోగ్యం దిగజారిపోతుందనేదానికి ఇది గుర్తు. ఆయనకు ఇచ్చే ఆహారంపై ఉన్నతస్థాయి విచారణ  జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ ఆహారం వల్ల ఆయన తనపై తాను నియంత్రణ కోల్పోతున్నారని నాకు అనుమానం కలుగుతోంది. ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన్ను గద్దె దించేందుకు కుట్ర చేస్తున్నారు’ అని మాంఝీ(Jitan Ram Manjhi) వ్యాఖ్యలు చేశారు.

చెత్తకుప్పలో లభ్యమైన ఆ రూ.25 కోట్లు నకిలీవేనట!

ఇటీవల బిహార్‌లో నిర్వహించిన కులగణన నివేదికను నీతీశ్(Nitish Kumar) సర్కారు గత మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికపై అసెంబ్లీలో మాంఝీ అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో మాంఝీని ఉద్దేశించి నీతీశ్‌ విరుచుకుపడ్డారు. ‘నేను ముఖ్యమంత్రి అయ్యాను అని ఆయన పదేపదే చెప్తున్నారు. నా పిచ్చితనం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోపక్క.. నివేదికను ప్రవేశపెట్టిన రోజు నీతీశ్‌ ‘జనాభా నియంత్రణ’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాంఝీ నుంచి ఈ సంచలన ఆరోపణలు రావడం గమనార్హం.

మాంఝీ 2014లో బిహార్‌(Bihar) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు ఆయన జేడీయూలో కీలక నేత. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జేడీయూ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పుడు ముఖ్యమంత్రిగా నీతీశ్‌ దిగిపోవడంతో.. మాంఝీకి ఆ అవకాశం వచ్చింది. తర్వాత జేడీయూ నుంచి బయటకు వెళ్లిపోయిన ఆయన హెచ్‌ఏఎం-ఎస్‌ పార్టీ స్థాపించారు. ప్రస్తుతం ఈ పార్టీ భాజపా భాగస్వామి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని