BSP: లోక్‌సభ ఎన్నికల్లో సోలోగానే పోటీ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడి

Mayawati on lok sabha polls: సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. ఎన్నికల అనంతరం మాత్రం పొత్తులు ఉండొచ్చని చెప్పారు.

Updated : 15 Jan 2024 15:29 IST

Mayawati | లఖ్‌నవూ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి (Mayawati) తెలిపారు. ఏ కూటమితోనూ పొత్తులుండవని స్పష్టంచేశారు. ఎన్నికల అనంతర పొత్తులను మాత్రం కొట్టిపారేయలేదు. తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమితోనూ పొత్తు ఉండదు. ఎన్నికల అనంతరం పొత్తులు ఉండొచ్చు. ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన సందర్భంలో బీఎస్పీకి చేదు అనుభం ఎదురైంది. పార్టీకి జరిగే మేలు కంటే కీడే ఎక్కువ. తమ ఓట్లు భాగస్వామ్యపక్షానికి బదిలీ అయినప్పటికీ.. అటు ఓట్లు మాత్రం ఇటు రావడం లేదు. కాబట్టి ఎన్నికల్లో పొత్తుల్లేకుండానే ఈ సారి ఎన్నికలకు వెళతాం’’ అని మాయావతి అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎస్పీలతో పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రాజీనామా.. షర్మిలకు లైన్‌క్లియర్‌?

ఈ సందర్భంగా రిటైర్మెంట్‌ గురించి కూడా మాయావతి మాట్లాడారు. తన తుదిశ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టంచేశారు. వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. ఉద్యోగాలు కల్పించకుండా ఉచిత రేషన్‌ పేరుతో భాజపా సరిపుచ్చుతోందని విమర్శించారు. రామమందిర ప్రాణప్రతిష్ఠకు తనకూ ఆహ్వానం అందిందని, పార్టీ కార్యక్రమాల దృష్ట్యా వెళ్లాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. రామమందిర ప్రారంభోత్సవంపై తనకెలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టంచేశారు. బాబ్రీ మసీదుకు సంబంధించి కార్యక్రమం నిర్వహించినా తాము స్వాగతిస్తామని చెప్పారు. బీఎస్పీ సెక్యులర్‌ పార్టీ అని, తాము అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని