Bomb threats: దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం

Bomb threats: దిల్లీ, నోయిడా ప్రాంతాల్లో దాదాపు 100 స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.

Updated : 01 May 2024 12:25 IST

దిల్లీ: బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. బుధవారం ఉదయం దిల్లీ (Delhi)-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని పలు స్కూళ్లకు బెదిరింపు మెయిల్‌ (Bomb threats) వచ్చింది. అప్రమత్తమైన స్కూల్‌ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలల (Schools)ను ఖాళీ చేయించాయి. పోలీసులు వెంటనే ఆయా స్కూళ్లకు వెళ్లి బాంబ్‌ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. 

దిల్లీలోని ద్వారక, చాణక్యపురి, మయూర్‌ విహార్‌, వసంత్‌ కుంజ్‌, సాకేత్‌ స్కూళ్లకు తొలుత ఈ బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత రాజధానితో పాటు నోయిడాలోని దాదాపు 100 పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని స్కూళ్లలో ఈ రోజు పరీక్షలు జరుగుతున్నాయి. బెదిరింపుల నేపథ్యంలో వాటిని మధ్యలోనే ఆపి విద్యార్థులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని పిల్లలను తీసుకెళ్లారు.

మణిపుర్‌ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర.. అల్లరిమూకలకు బాధితులను వారే అప్పగించారు..!

నకిలీ బెదిరింపులే..: హోంశాఖ

ఒకే సమయంలో ఇన్ని స్కూళ్లను బెదిరింపులు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించింది. ‘‘ఈ బెదిరింపు మెయిల్స్‌ నకిలీ మాదిరిగానే కన్పిస్తున్నాయి. ప్రజలెవరూ కంగారుపడొద్దు. పోలీసులు, భద్రతా ఏజెన్సీలు తనిఖీలు చేపడుతున్నాయి’’ అని హోంశాఖ అధికారి వెల్లడించారు.

అటు దిల్లీ పోలీసులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తపర్చారు. తనిఖీల్లో ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించలేదని తెలిపారు. అవి నకిలీ బెదిరింపులే అయి ఉంటాయని పేర్కొన్నారు. మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ-మెయిల్ ఐపీ అడ్రస్‌లను బట్టి విదేశాల నుంచి దీన్ని పంపించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒకే వ్యక్తి నుంచి ఈ బెదిరింపులు వచ్చి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. రష్యా నుంచి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ దిల్లీలో పలు స్కూళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపులే వచ్చాయి. పోలీసులు తనిఖీలు జరపగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. అది నకిలీ బెదిరింపు అయి ఉంటుందని పోలీసులు అప్పట్లో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని