విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి

అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు.

Published : 01 May 2024 05:11 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అనిల్‌కుమార్‌ అనే ఓ వ్యక్తి దిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న తన కుమార్తె ఉర్వి(36)ని 2016లో దిల్లీకి చెందిన కంప్యూటర్‌ ఇంజినీర్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. కొద్దికాలం తర్వాత వరకట్నం కోసం యువతిని అత్తమామలు, భర్త వేధించడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఎనిమిదేళ్లు హింసను భరించిన అనంతరం ఫిబ్రవరి 28న కోర్టు తీర్పు వెలువడింది. న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో యువతిని ఆమె తండ్రి.. అత్తవారి ఇంటి నుంచి బ్యాండ్‌మేళంతో ఊరేగింపుగా తమ ఇంటికి తీసుకెళ్లారు. ‘‘మేం మా కుమార్తెను పెళ్లి తర్వాత మెట్టినింటికి ఎలా పంపామో అలాగే పుట్టింటికి తెచ్చుకున్నాం. ఈ సంఘనటతో మా కుమార్తె, మనవరాలు నిరాశలో ఉండిపోకూడదని, నేటి నుంచి వారు కొత్త జీవితం ప్రారంభించాలని కోరుకున్నాం. అందుకే వారిని మేళతాళాలతో ఆనందంగా ఇంటికి ఆహ్వానించాం’’ అని అనిల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుంటానని ఉర్వి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని