మణిపుర్‌ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర

దేశంలో కలకలం రేపిన మణిపుర్‌ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది.

Updated : 01 May 2024 06:23 IST

 సాయం కోరిన బాధితులను పట్టించుకోలేదు
అల్లరిమూకలకు వారే అప్పగించారు: సీబీఐ ఛార్జిషీటు

దిల్లీ: దేశంలో కలకలం రేపిన మణిపుర్‌ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. కాంగ్‌పోక్పీ జిల్లాలో మైతేయ్‌ మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ - జోమి తెగ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు చేరుకొని ఆశ్రయం కోరగా, స్వయంగా పోలీసు సిబ్బందే బాధితులను సాయుధులైన అల్లరిమూకలకు అప్పగించినట్లు ఛార్జిషీటు పేర్కొంది. ఆ తర్వాతే ఇద్దరు మహిళలను వివస్త్రలుగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించారు. బాధితురాళ్లలో ఒకరు కార్గిల్‌ యుద్ధవీరుడి భార్య. తమను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఈమె పోలీసులను కోరగా.. ‘జీపు తాళాలు లేవు’ అని వారు బుకాయించినట్లు పేర్కొన్నారు. అల్లరిమూకల చేతికి చిక్కిన మూడో మహిళ ఈ అఘాయిత్యం నుంచి త్రుటిలో తప్పించుకొంది. గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్‌గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ అకృత్యాలపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గువాహటిలోని సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ దాడుల్లో అల్లరిమూకల చేతిలో మృతిచెందిన కుకీ తెగ తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరు లేని నదిలోకి విసిరేసినట్లు తెలిపారు. మైతేయ్‌ మూకలు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి పోలీసులు పారిపోయినట్లు సీబీఐ తన మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది. పైగా సాయం చేయమని అర్థించిన ఓ మహిళను పోలీసులు తోసివేసినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని