కూటమి పేరులో ‘ఇండియా’ ఉంటే సరిపోదు: విపక్షాలపై మోదీ తీవ్ర విమర్శలు

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ(Modi) తీవ్ర విమర్శలు చేశారు. వాటి తీరుపై మండిపడ్డారు. 

Updated : 25 Jul 2023 16:06 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ(Modi) విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష ఎంపీలు తమ నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో ఆయన ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఏ దిశాదశ లేకుండా వారు ముందుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. 

మంగళవారం నిర్వహించిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘ఇలా ఒక లక్ష్యం లేకుండా ముందుకెళ్లే విపక్షాలను నేను ఇంతవరకు చూడలేదు. అవి అధికారంలోకి రావాలనుకోవడం లేదు. ఎప్పటికీ విపక్షంలోనే ఉండాలని అవి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. పేరులో ఇండియా(I.N.D.I.A) ఉంటే సరిపోదు. వారు దేశ ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ఆ పదాన్ని ఉపయోగించారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్.. వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉంది’ అంటూ వాటిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి.

మయన్మార్‌ నుంచి మణిపుర్‌కు.. రెండు రోజుల్లో 700 మంది

ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ కార్యకలాపాలు(Monsoon Session of Parliament) ఒక్కరోజు కూడా సజావుగా సాగలేదు. మణిపుర్‌(Manipur)లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, ఇటీవల అక్కడ వెలుగులోకి వచ్చిన వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని పార్లమెంట్‌(Parliament)లో ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఉభయసభల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అలసిపోయి, నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కూటమికి సింగిల్ పాయింట్ అజెండా.. మోదీని వ్యతిరేకించడమేనని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మణిపుర్‌పై మాట్లాడమంటే.. ఈస్ట్‌ ఇండియా అంటున్నారు : విపక్షాల ధ్వజం

మోదీ వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పందించారు. ‘రూల్ 267 కింద చర్చ జరపాలని పలువురు సభ్యులు నోటీసులు ఇచ్చారు. మేము మణిపుర్ అంశంపై మాట్లాడుతుంటే.. ప్రధాని మాత్రం ఈస్ట్‌ ఇండియా అంటున్నారు’ అంటూ మోదీ వ్యాఖ్యలకు ఖర్గే బదులిచ్చారు. మరోపక్క రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్ గోయల్(Piyush Goyal ) మాట్లాడుతూ.. ‘హోం మంత్రి అమిత్‌ షా మణిపుర్ అంశంపై మాట్లాడతారు. అలాగే మేం రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, పశ్చిమ్ బెంగాల్‌, మణిపుర్‌లో మహిళలపై జరుగుతోన్న అకృత్యాలపై కూడా చర్చించాలని భావిస్తున్నాం’ అని గోయల్‌ అన్నారు. మణిపుర్ అంశంపై చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం చెప్పినప్పటికీ..  విపక్ష ఎంపీలు నిరసన కొనసాగించడంతో రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని