Modi-Pawar: మోదీ-పవార్‌ సమావేశం.. ఈ భేటీ ఎందుకో..?

బుధవారం ప్రధాని నరేంద్రమోదీ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ పార్లమెంట్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య 20 నిమిషాల పాటు చర్చ జరిగింది.

Published : 06 Apr 2022 18:01 IST

దిల్లీ:  ప్రధాని నరేంద్రమోదీ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ పార్లమెంట్ ప్రాంగణంలో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య 20 నిమిషాల పాటు చర్చ జరిగింది. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

వీరి సమావేశానికి గల కారణమేంటో స్పష్టంగా తెలియరాలేదు. అయితే మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలోని నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరుపుతోన్న విషయం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ రోజు ఉదయం మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఈ నేత ఎన్‌సీపీకి చెందినవారు. ఇదిలా ఉండగా.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య, మరో ఇద్దరు అనుచరులకు చెందిన రూ.11.15 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ మంగళవారం తాత్కాలికంగా జప్తు చేసింది. కొన్ని భూ ఒప్పందాలకు సంబంధించి నగదు అక్రమ చలామణి దర్యాప్తులో భాగంగా చర్యలు చేపట్టినట్లు కేంద్ర సంస్థ వెల్లడించింది.

ఇంకోపక్క నిన్న సాయంత్రం పవార్ తన ఇంట్లో మహారాష్ట్రకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కేంద్ర మంత్రి, భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. ఇది మహారాష్ట్రకు సంబంధించిన అంశాలపై జరిగిన కార్యక్రమం అంటూ ఎన్‌సీపీ వెల్లడించింది. ఒకవైపు ఈడీ దాడులు, మరోవైపు వరుస సమావేశాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఇక త్వరలో రాష్ట్రపతి పదవికి ఎన్నిక ఉండగా.. మోదీతో పవార్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని