UPI Fraud: యూపీఐ మోసాన్ని తిప్పికొట్టిందిలా.. మహిళ పోస్ట్‌ వైరల్‌

UPI Fraud: డబ్బు దోచుకునేందుకు సైబర్‌ మోసగాడు చేసిన ప్రయత్నాన్ని ఓ మహిళ చాకచక్యంగా అడ్డుకుంది. అతడి ఎత్తులను చిత్తు చేసింది. ఇంతకీ ఆ మోసం నుంచి ఆమె ఎలా తప్పించుకుందంటే..?

Updated : 06 Jan 2024 13:23 IST

ముంబయి: సైబర్‌ నేరాల (Cyber scams) సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. వీటిపై ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నేరగాళ్లు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల ముంబయి (Mumbai)కి చెందిన మహిళకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. యూపీఐ బదిలీ పేరుతో ఓ వ్యక్తి ఆమె నుంచి డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, అందులో ఏదో మోసం ఉందని గ్రహించిన ఆమె.. చాకచక్యంగా అతడి యత్నాన్ని భగ్నం చేసింది. తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ సోషల్‌ మీడియాలో ఆమె చేసిన సుదీర్ఘ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

‘‘ఇటీవల ఓ వ్యక్తి యూపీఐ బదిలీతో నన్ను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. మా నాన్న ఇంట్లో లేని సమయంలో నాకు ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. నా నంబరును మా నాన్నే ఇచ్చారని అవతలి వ్యక్తి చెప్పాడు. బేటా అంటూ మాట కలిపాడు. మా నాన్నకు రూ.25 వేల ఎల్‌ఐసీ డబ్బులు ఇవ్వాలని, ఆయనకు గూగుల్‌పే లేకపోవడంతో నా నంబరుకు పంపిస్తానని అన్నాడు. మా నాన్నకు నిజంగానే గూగుల్‌ పే లేకపోవడంతో అతడు చెప్పిన మాటలు నేను నమ్మాల్సి వచ్చింది. అందుకే డబ్బు పంపించమని చెప్పా’’

‘‘నేను అతడితో కాల్‌లో ఉండగానే.. నా ఫోన్‌కు రూ.20వేలు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. ఆ తర్వాత ఇంకో రూ.5వేలు పంపిస్తున్నానని చెప్పాడు. అయితే, ఈసారి నాకు రూ.50 వేలు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి నన్ను మిగతా రూ.45 వేలు తిరిగి పంపించమని కోరాడు. రెండుసార్లు డబ్బులు పంపినట్లు మెసేజ్‌ వచ్చినా.. నా అకౌంట్లో జమ కాలేదు. అదే విషయాన్ని అతడికి చెప్పా’’

‘‘గూగుల్‌పే యాప్‌లోనూ డబ్బులు వచ్చినట్లు మెసేజ్‌ చూపించింది. కానీ అకౌంట్లోకి రాలేదు. అప్పుడు నాకు అతడిపై అనుమానం వచ్చింది. ఏదో మోసం జరుగుతోందని గ్రహించా. మా నాన్న వచ్చేదాకా ఆగమని, ఆయన నంబరు నుంచి కాల్‌ చేస్తా అని చెప్పా. ఆ వెంటనే అవతలి వ్యక్తి ఫోన్‌ కట్‌ చేసేశాడు. అది మోసపూరిత కాల్‌ అని అప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది’’ అని ఆ మహిళ తన పోస్టుల్లో వివరించారు.

ప్రస్తుతం ఆమె పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. నిజమే మరి.. తెలిసిన వ్యక్తుల పేర్లతో ఇలాంటి నకిలీ కాల్స్, మెసేజ్‌లు రావడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. దీంతో ప్రజలు సులువుగా మోసాల బారిన పడుతున్నారు. అందుకే.. ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, పోలీసులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని