Operation Ironside: 18 దేశాల్లో 800 నేరగాళ్ల ఆరెస్ట్‌!

అండర్‌వరల్డ్‌లో ఉంటూ ఎన్నోఏళ్లుగా మాదకద్రవ్యాల నుంచి హత్యోదంతాలకు పాల్పడుతోన్న అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల (Organised Crime) గుట్టు రట్టయ్యింది.

Published : 08 Jun 2021 19:39 IST

వ్యవస్థీకృత నేరగాళ్లపై అంతర్జాతీయ ఆపరేషన్‌

వాషింగ్టన్‌: అండర్‌వరల్డ్‌లో ఉంటూ ఎన్నోఏళ్లుగా మాదకద్రవ్యాల నుంచి హత్యోలకు పాల్పడుతోన్న అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరగాళ్ల (Organised Crime) గుట్టు రట్టయ్యింది. ఆస్ట్రేలియా పోలీసులు, అమెరికా ఎఫ్‌బీఐ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో వందల సంఖ్యలో నేరగాళ్లు చిక్కిపోయారు. ఈ ఆపరేషన్‌లో 18 దేశాల్లో దాదాపు 800 మంది నేరగాళ్లను అరెస్టు చేసినట్లు సమాచారం. వీరి నుంచి వందల సంఖ్యలో మారణాయుధాలు, టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు, కొన్ని కోట్ల డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతోన్న అంతర్జాతీయ గ్యాంగ్‌లకు ఇది చెంపపెట్టు అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ పేర్కొన్నారు.

ఆపరేషన్‌ ఐరన్‌సైడ్‌..

నిఘా వ్యవస్థలకు చిక్కకుండా అండర్‌వరల్డ్‌ (Underworld)లో ఉంటూ ఎన్నో నేరాలకు పాల్పడే అంతర్జాతీయ నేరగాళ్లు గత కొన్నేళ్లుగా తమ పంథాను మార్చారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించే ఇలాంటి నేరగాళ్లు..  డిజిటల్‌ సాధనాలను సురక్షితంగా భావిస్తూ సురక్షిత సమాచార వ్యవస్థ ద్వారా తమ నేర సామ్రాజ్యాన్ని విస్తురిస్తున్నారు. ముఖ్యంగా నిఘా వర్గాల చేతికి చిక్కకుండా మాదక ద్రవ్యాల రవాణా, హత్యలు, అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా నిలుస్తున్నారు. ఇలాంటి వారికి చెక్‌ పెట్టేందుకు ఆస్ట్రేలియా పోలీసులు, అమెరికా ఎఫ్‌బీఐ సహకారంతో 2018లో స్టింగ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. అమెరికాలో ఎఫ్‌బీఐ దీనిని ఆపరేషన్‌ ట్రోజన్‌ షీల్డ్‌ (Operation Trojan Shield) పేర్కొనగా.. ఆస్ట్రేలియా పోలీసులు దీనికి ఆపరేషన్‌ ఐరన్‌సైడ్‌ (Operation Ironside)గా వ్యవహరించారు. అనంతరం ఈ ఆపరేషన్‌లో యూరోపియన్‌ పోలీసులు (యూరోపోల్‌)లతో పాలు మరిన్ని దేశాలు కూడా జతకలిశాయి.

ఎలా చిక్కారంటే..

అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థలు కలిగిన డిజిటల్‌ సాధనాలను అంతర్జాతీయ నేరగాళ్లు విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా EncroChat, Sky ECC వంటి ప్లాట్‌ఫామ్‌లను వాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇదే అదునుగా భావించిన ఫెడరల్‌ పోలీసులు ఓ ప్రత్యేకమైన ఫోన్‌ను రూపొందించాయి. కెమెరా, మాట్లాడే సౌకర్యం లేని ANOM (An0m) యాప్‌ ఉన్న ప్రత్యేక ఫోన్‌లను మధ్యవర్తుల ద్వారా అండర్‌వరల్డ్‌ నేరగాళ్లకు చేరేట్లు ప్రయత్నించారు. అలా అక్కడినుంచి వివిధ దేశాల్లో ఉన్న వారి భాగస్వామ్య గ్యాంగ్‌లకు ఈ ఫోన్‌లు చేరిపోయాయి. వీటిలో కేవలం మెసేజ్‌ రూపంలో సమాచారాన్ని పంచుకునే వీలు ఉండడంతో నేరగాళ్లు వాటిని సురక్షితంగా భావించారు. ఇలా 18నెలల కాలంలో 100దేశాల్లో దాదాపు 300 క్రిమినల్‌ గ్యాంగ్‌లకు ఈ సాంకేతికతను వినియోగించడం మొదలుపెట్టారు. అదే సయమంలో అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు ఆయా దేశాల నిఘా వర్గాలు ఆ యాప్‌లోని లక్షల సంఖ్యలో మెసేజ్‌లను విశ్లేషిస్తూ వచ్చాయి. వీటిలో నేరగాళ్లు మాదక ద్రవ్యాలు, హింస, అమాయకుల హత్యలకు సంబంధించిన వ్యూహాలనే ఎక్కువగా చర్చించినట్లు అధికారులు గుర్తించారు. ఆపరేషన్‌ జరుగుతున్న సమయంలో ఓ కేఫ్‌ వద్ద మెషిన్‌ గన్‌తో దాడి చేయాలకున్న ప్రయత్నాన్ని పోలీసులు నిలువరించగలిగారు. ఆపరేషన్‌ తుది దశలో భాగంగా అరెస్టుల పర్వం మొదలు కావడంతో అంతర్జాతీయ నేరగాళ్ల సామ్రాజ్యం గుట్టురట్టయ్యింది.

18 దేశాల్లో 800 మంది అరెస్ట్‌

పోలీసులు హ్యాక్‌ చేసిన విషయాన్ని పసిగట్టని నేరగాళ్లు వారి సమాచార మార్పిడిని అలాగే కొనసాగించారు. చివరకు ఒక రోజులో భారీ సెర్చ్‌ వారెంట్లను జారీ చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. దాదాపు 224 మందిని అరెస్టు చేసింది. వారినుంచి 104 ఆయుధాలు,కోట్ల డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో దాదాపు 800 మంది నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఆస్ట్రేలియన్‌ ఫెడరల్‌ పోలీస్‌ కమిషనర్‌ రీసె కెర్షా పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ మాదకద్రవ్యాల రవాణాలో ఆస్ట్రేలియాతో పాటు ఆసియా, దక్షిణ అమెరికా, మిడిల్‌ ఈస్డ్‌ దేశాలకు చెందిన నేరగాళ్ల పాత్రే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాంటి వారిని న్యూజిల్యాండ్‌లో 35మందిని అరెస్ట్‌ చేసినట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అమెరికా, యూరప్‌ దేశాల సమాచారాన్ని ఆయా ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి.

‘వివిధ దేశాల నిఘా సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌ వ్యవస్థీకృత నేరగాళ్లకు భారీ ఎదురు దెబ్బ. కేవలం ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోన్న ఈ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారికి చెంపపెట్టు’ అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని