IndiGo: గంటలపాటు విమానం ఆలస్యం.. పైలట్‌పై ప్రయాణికుడి దాడి

IndiGo: విమాన ప్రయాణం ఆలస్యమవుతోందని తీవ్ర నిరాశకు గురైన ఓ ప్రయాణికుడు పైలట్‌పై దాడి చేశాడు.   

Updated : 15 Jan 2024 16:21 IST

దిల్లీ: విమానంలో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. ఫ్లైట్‌ ఆలస్యంగా బయల్దేరుతుందని ప్రకటించిన పైలట్‌(Pilot)పై దాడికి పాల్పడ్డాడు. ఇండిగో(IndiGo) విమానంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

దిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో(IndiGo) విమానానికి పొగమంచు కారణంగా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణం ఆలస్యం అవుతుందని పైలట్(Pilot) ప్రకటించాడు. ఇది విన్న ఓ ప్రయాణికుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. చివర వరుసలో కూర్చున్న అతడు పైలట్‌ వద్దకు దూసుకువచ్చి దాడి చేశాడు. ఈ ఘటనపై ఇండిగో(IndiGo) ఫిర్యాదు చేసింది. అతడిని విమానం నుంచి దించేసి.. భద్రతా సిబ్బందికి అప్పగించింది. ఈ విమానం 13 గంటల ఆలస్యమైంది.

మరికొన్ని దృశ్యాల్లో ఆ ప్రయాణికుడు చేతులు జోడించి క్షమాపణలు చెప్పడం కనిపించింది. ఆ క్షమాపణలను కెప్టెన్‌ తిరస్కరించారు. ‘సారీ వద్దు. నువ్వు నాపై చేతులెత్తావ్‌’ అని కెప్టెన్‌ అనడం వినిపించింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సదరు ప్రయాణికుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. ‘విమానం ఆలస్యానికి అందులోని సిబ్బంది ఏం చేస్తారు..? వెంటనే ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి, నో ఫ్లై లిస్ట్‌లో చేర్చండి’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాలిలో ఉండగా కాక్‌పిట్‌ అద్దంపై పగుళ్లు

ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. అతి సమీపంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దాంతో భారీ సంఖ్యలో విమానాలు ఆలస్యమవుతున్నాయి. సోమవారం కూడా వందకు పైగా విమానాలు ఆలస్యంకాగా.. 79 రద్దయ్యాయి. ఒక్కో విమానం కనీసం 50 నిమిషాల మేర ఆలస్యంగా నడుస్తోంది. ఈ పరిస్థితులతో ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని