రిజర్వాయర్‌లో పడిపోయిన ఫోన్‌.. 41 లక్షల లీటర్లు ఖాళీ చేయించిన అధికారి!

రిజర్వాయర్‌లో పడిపోయిన తన ఫోన్‌ కోసం ఓ అధికారి అందులోంచి 41 లక్షల లీటర్లను ఖాళీ చేయించడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

Updated : 27 May 2023 09:15 IST

రాయ్‌పుర్: రిజర్వాయర్‌ (Kherkatta Reservoir)లో పడిపోయిన తన ఫోన్‌ కోసం ఓ ప్రభుత్వ అధికారి.. అందులోంచి ఏకంగా  41 లక్షల లీటర్ల నీటిని ఖాళీ చేయించారు. దీని కోసం రెండు భారీ మోటర్లను మూడు రోజులపాటు నిరంతరాయంగా నడిపించడం గమనార్హం.. ఇది కాస్త వివాదాస్పదం కావడంతో.. అధికార దుర్వినియోగంతోపాటు సంబంధిత విభాగం నుంచి సరైన అనుమతి తీసుకోలేదనే ఆరోపణల కింద ఆ అధికారిపై కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

రాజేశ్‌ విశ్వాస్‌ అనే వ్యక్తి ఇక్కడి కాంకేర్‌ జిల్లాలో ఫుడ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్నేహితులతో కలిసి స్థానికంగా ఖేర్‌కట్టా డ్యామ్‌ సందర్శనకు వచ్చారు. ఈ క్రమంలోనే సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఆయన స్మార్ట్‌ఫోన్‌ అక్కడి ఓవర్‌ ఫ్లో ట్యాంక్‌ నీళ్లలో పడిపోయింది. రూ.లక్షకుపైగా ఖరీదైన ఫోన్‌ కావడం, అందులో అధికారిక సమాచారం ఉందని తెలపడంతో.. దాన్ని కనిపెట్టేందుకు తొలుత స్థానిక ఈతగాళ్లను రంగంలోకి దించారు. 15 అడుగుల లోతైన నీళ్లలో వారు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది.

దీంతో ఈ విషయంపై జలవనరుల విభాగం అధికారికి మౌఖికంగా సమాచారం ఇచ్చిన ఆ అధికారి.. రెండు భారీ మోటార్లతో నీళ్లను ఖాళీ చేయించడం ప్రారంభించారు. సోమవారం సాయంత్రం నుంచి గురువారం వరకు మూడు రోజుల్లో అవి దాదాపు 41 లక్షల లీటర్ల నీళ్లను బయటకు తోడేశాయి. దీంతో ఈ వ్యవహారంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. స్పందించిన జలవనరుల విభాగం.. ఈ ప్రక్రియను నిలిపేసింది. అయితే, ఆ నీళ్లు నిరుపయోగమని తెలిసిందని, అందుకే కొంత భాగాన్ని ఖాళీ చేయించినట్లు ఆ అధికారి చెప్పడం గమనార్హం.

చివరకు ఆ ఫోన్‌ను వెలికితీసినా.. అది పని చేయడం లేదని తేలింది. ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ సీఎం, భాజపా నేత రమణ్ సింగ్.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఒకవైపు ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతుంటే.. మరోవైపు పెద్దమొత్తంలో నీళ్లను తోడేశారని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి అమర్‌జీత్ భగత్ తెలిపారు. అయితే, కొంత మేర నీళ్లను తోడేందుకే అనుమతి ఇచ్చామని, కానీ.. చాలా ఎక్కువే ఖాళీ చేశారని జలవనరుల విభాగం అధికారి వివరణ ఇచ్చారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు