PM Modi: ప్రపంచం కోసం భారత్‌ పనిచేస్తోంది: ప్రధాని మోదీ

సిక్కుమత గురువు తేజ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మాట్లాడారు.

Updated : 22 Apr 2022 00:22 IST

దిల్లీ: భారత్‌ ఎప్పుడూ ఏ దేశానికైనా, సమాజానికైనా హాని తలపెట్టదని, ప్రపంచ సంక్షేమం కోసం ఆలోచిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సిక్కుమత గురువు తేజ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి మాట్లాడారు. సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుంచి ప్రసంగించిన మొదటి ప్రధాని మోదీ కావడం విశేషం.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘భారత స్వాతంత్ర్య స్వప్నం ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించింది. మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్య ఫలాలు మనం అనుభవిస్తున్నాం. సిక్కుగురువుల ఆదర్శాలను భారత్‌ అనుసరిస్తోంది. మన గురువులు సామాజిక బాధ్యతలు నిర్వర్తించారు. సామాజిక బాధ్యత కోసం గురువులు తమ జీవితాలను సమర్పించారు. తమ శక్తిని సేవా మాధ్యమంగా మలుచుకున్నారు. దురాగతాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా దేశాన్ని గొప్పశక్తి నడిపించింది. గురుగోవింద్‌జీ యాత్ర స్థలాలను రైల్వే ద్వారా అనుసంధానిస్తాం. గురు తేజ్‌ బహదూర్‌ బలిదానానికి గుర్తుగా శిశు గంజ్‌ సాహిబ్‌  గురుద్వారా ఉంది. అప్పట్లో మతం పేరుతో హింస తారస్థాయికి చేరింది. ఔరంగజేబు నిరంకుశ ఆలోచనల ముందు గుర్‌ తేజ్‌ ధైర్యంగా నిలిచారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడానికి గురు తేజ్‌ త్యాగం తరాల వారికి స్ఫూర్తిగా నిలిచింది. మత ఛాందసవాద తుపానులు సంభవించినా భారతదేశం నిలబడగలిగింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం నేడు భారత్‌ వైపు చూస్తోంది. అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న వానిరి స్వదేశానికి తరలించగలిగాం. అఫ్గాన్‌ నుంచి వచ్చిన వారికి కూడా పౌరసత్వం ఇచ్చాం. ఇవాళ మొత్తం ప్రపంచం కోసం భారత్‌ పనిచేస్తోంది. భారతదేశం సంప్రదాయ వైద్యాన్ని వ్యాప్తి చేస్తోంది. ప్రపంచ సంఘర్షణలో కూడా భారత్‌ శాంతినే కోరుకుంటోంది. దేశాభివృద్ధిలో అందిరి కృషి అవసరం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

1675లో అప్పటి పరిపాలకుడిగా ఉన్న ఔరంగజేబు తొమ్మిదవ సిక్కుమత గురువైన తేజ్‌ బహదూర్‌ను ఉరితీయాలని ఎర్రకోట నుంచే ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు ప్రధాని మోదీ ప్రసంగానికి ఈ కోటను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణెం విడుదల చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని