PM Modi: అలసత్వం వద్దు.. మాస్క్‌లు ధరించండి.. టెస్టులు పెంచండి: మోదీ
కొవిడ్(COVID 19) నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని.. రద్దీ ప్రదేశాల్లో అందరూ మాస్కు(Mask)లు ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) విజ్ఞప్తి చేశారు.
దిల్లీ: చైనా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసులు(Corona virus) మరోసారి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో కరోనా కేసులపై ప్రస్తుతం కొనసాగుతున్న నిఘాను (ముఖ్యంగా విమానాశ్రయాల్లో) మరింత మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు పాటించడంలో అలసత్వం ప్రదర్శించకుండా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా జీనోమ్ సీక్వెన్సింగ్‌పై దృష్టిపెట్టి కొత్త వేరియంట్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో కరోనా పరిస్థితి, ఆస్పత్రుల్లో మౌలికవసతుల సన్నద్ధత, లాజిస్టిక్స్, వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ తదితర అంశాలపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కరోనా ఇంకా అంతం కాలేదని.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. న్యూ ఇయర్ వేడుకలు, పండుగ సీజన్ నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, పడకలు అందుబాటులో ఉండేలా చూడాలని.. ఆయా ఆస్పత్రుల్లో మౌలిక వసతులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొవిడ్ చికిత్సకు అవసరమైన ఔషధాలు, మందుల లభ్యతతో పాటు వాటి ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రికాషన్ డోసులు పెంచడంపై దృష్టిసారించాలని సూచించారు. టెస్టుల సంఖ్య భారీగా పెంచాలని, తద్వరా జీనోమిక్ సీక్వెన్సింగ్ ప్రక్రియను చేపట్టాలని అధికారులకు ఆదేశించినట్టు పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా రాష్ట్రాలు రోజువారీగా వచ్చిన పాజిటివ్ కేసుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపాలని సూచించారు. తద్వారా సకాలంలో కొత్త వేరియంట్లను గుర్తించి.. తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు.
వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషన్, నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు వీకేపాల్.. ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుదల అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. మన దేశంలో కరోనా కేసులు సంఖ్య స్థిరంగా తగ్గుముఖం పడుతున్న అంశాన్ని మోదీకి వివరించారు. రోజువారీ కేసుల సంఖ్య సగటున 153 వస్తుండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.14శాతంగా ఉందని పేర్కొన్నారు. గత ఆరు వారాలుగా ప్రపంచంలో సగటున రోజుకు నమోదవుతున్న కేసుల సంఖ్య 5.9లక్షలుగా ఉందని వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆరోగ్య శాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే శర్మ, నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, పీఎంవో సలహాదారు అమిత్ ఖారే, హోంశాఖ కార్యదర్శి ఏకే భల్లా, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ సహా పలువురు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.