PM Modi: రాజీవ్‌ ఖేల్‌ రత్న పేరు మార్పు.. ప్రధాని ట్వీట్‌

క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది.

Updated : 06 Aug 2021 14:22 IST

దిల్లీ: క్రీడాకారులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారంగా మార్పు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

భారత దేశంలో ఈ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో ప్రారంభించారు. అప్పటి నుంచి దాన్ని రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డుగా పరిగణిస్తున్నారు.  దానికింద ఒక ప్రశంసా పత్రం, పతకం, నగదు పురస్కారం అందిస్తారు. సాధారణంగా ఈ పురస్కారాన్ని ప్రకటించేందుకు ఏడాది ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారు. వ్యక్తిగతంగా లేక జట్టుకు ఈ పురస్కారం ఇస్తారు. ఇప్పుడు ఆ పేరు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా మారింది.

మేజర్ ధ్యాన్‌చంద్‌ హాకీ మాంత్రికుడిగా పేరుగాంచారు. ఆయన జట్టు వరుసగా మూడుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజు(ఆగస్టు 29)ను క్రీడా దినోత్సవంగా జరుపుకొంటారు.

ఇదిలా ఉండగా.. టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ ఇండియా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. పురుషుల జట్టు కాంస్య పతకాన్ని చేజిక్కించుకోగా, మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే పేరు మార్పుపై ప్రకటన రావడం విశేషం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని