Delhi: దిల్లీలో బొగ్గు కొరత.. ఆసుపత్రులు, మెట్రోలకు కరెంట్‌ కట్‌ అవకాశం!

దేశ రాజధాని దిల్లీలో బొగ్గు కొరత సమస్య నానాటికీ తీవ్రంగా మారుతోంది. ఇదిలా కొనసాగితే విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, మెట్రోలు, ఆసుపత్రులకు కూడా కరెంట్‌ సరఫర్‌ నిలిచిపోతుందని

Published : 29 Apr 2022 10:50 IST

హెచ్చరించిన దిల్లీ ప్రభుత్వం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో బొగ్గు కొరత సమస్య నానాటికీ తీవ్రంగా మారుతోంది. ఇదిలా కొనసాగితే విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని.. మెట్రోలు, ఆసుపత్రులకు కూడా కరెంట్‌ సరఫరా నిలిచిపోతుందని దిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని హెచ్చరించింది. తక్షణమే రాజధానిలోని విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను పెంచాలని కోరింది. ఈ మేరకు విద్యుత్‌ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

‘‘దిల్లీలోని రెండు ప్రధాన విద్యుత్ స్టేషన్లు అయిన దాద్రి-2, ఊంచహార్‌ ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. దిల్లీలో అవసరమయ్యే విద్యుత్‌ డిమాండ్‌లో 25-30 శాతం ఈ స్టేషన్ల నుంచే వస్తుంది. ఈ రెండు పవర్‌ ప్లాంట్ల వద్ద ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఇదిలాగే కొనసాగితే, దిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెట్రో స్టేషన్ల వంటి అత్యవసర, కీలక సేవలకు 24 గంటల నిరంతర కరెంట్‌ను సరఫరా చేయడం కష్టంగా మారుతుంది’’ అని దిల్లీ సర్కారు ఓ ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు ఇప్పటికే పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే ఉంటున్నాయి. దీంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే డిమాండ్‌కు తగినంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు బొగ్గు కొరత సమస్యగా మారిందని ప్రభుత్వం చెబుతోంది.

ఇదిలా ఉండగా.. దిల్లీకి బొగ్గు సరఫరాను పెంచేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినట్లు భారత రైల్వే వెల్లడించింది. అయితే ఈ రైళ్ల రద్దు తాత్కాలికమేనని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వీటిని తిరిగి పునరుద్ధరిస్తామని ఇండియన్‌ రైల్వే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ కృష్ణ బన్సాల్ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని