Ahmad Massoud: తుదిశ్వాస విడిచేవరకు పోరాడతా..

తమపై దాడి చేసేందుకు తాలిబన్లకు పాకిస్థాన్‌ సాయమందిస్తోందని రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్ఏ) నాయకుడు అహ్మద్‌ మసూద్‌ వెల్లడించారు.....

Updated : 06 Sep 2021 21:48 IST

కాబుల్‌: పంజ్‌షేర్‌ లోయను హస్తగతం చేసుకొన్నామని తాలిబన్లు చేసిన ప్రకటనను పంజ్‌షేర్‌లోని రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్ఏ) నాయకుడు అహ్మద్‌ మసూద్‌ ఖండించారు. తాలిబన్ల దాడిని తిప్పికొడుతున్నట్లు తెలిపారు. తమపై దాడి చేసేందుకు తాలిబన్లకు పాకిస్థాన్‌ సాయమందిస్తోందని ఆరోపించారు. తమ పోరాటం అజేయమైనదని.. తుది శ్వాస విడిచేంతవరకు పంజ్‌షేర్‌ కోసం పోరాడతానని పేర్కొన్నారు. వ్యాలీలో రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ పోరాడుతున్నాయని.. తాలిబన్లతో పోరాటం చేస్తూనే ఉంటామని ఫేస్‌బుక్‌ ఆడియో మెసేజ్‌ ద్వారా మసూద్‌ వెల్లడించినట్లు టోలో న్యూస్‌ తెలిపింది. స్వేచ్ఛ కోసం దుష్టమూకలతో పోరాడాలని అఫ్గాన్‌ ప్రజలకు పిలుపునిచ్చినట్లు పేర్కొంది.

ఆగస్టు 15న అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత.. వారు తమపై దాడి చేస్తూనే ఉన్నారని, ఇందుకు పాక్‌ వారికి సాయం చేస్తోందని మసూద్‌ నొక్కి చెప్పారు. అయితే ఇదంతా అంతర్జాతీయ సమాజం నిశ్శబ్దంగా చూస్తూ ఉందని వాపోయారు. తన కుటుంబ సభ్యులను తాలిబన్లు హత్య చేశారని, ఇందుకు పాకిస్థాన్‌ సాయమందించిందని ఆయన తెలిపారు. ‘ఈ దాడుల విషయంలో పాకిస్థాన్‌ ప్రమేయం ఉందని అన్ని దేశాలకు తెలుసు. పంజ్‌షేర్‌లోని అఫ్గాన్లపై పాక్‌ నేరుగానే దాడి చేస్తోంది. ఇదంతా చూస్తున్న అంతర్జాతీయ సమాజం నిశ్శబ్దంగానే ఉంటోంది’ అని అహ్మద్‌ మసూద్‌ పేర్కొన్నారు. తాలిబన్లు ఒకప్పటిలాగే క్రూరంగా, హింసాత్మకంగా, అణచివేత ధోరణితో ఉన్నారని.. వారిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు.

ఎన్‌ఆర్‌ఎఫ్ఏ అధికార ప్రతినిధి ఫాహిమ్‌ దాస్తీ మృతిని నిర్ధరిస్తూ.. ఆయన హత్యకు పాకిస్థానే కారణమని మసూద్‌ వెల్లడించారు. ‘దుష్టమూకల దాడిలో మేము ఈరోజు ఇద్దరు ప్రియమైన సోదరులతోపాటు మరికొంతమంది పోరాటయోధులను కోల్పోయాం. ఎన్‌ఆర్‌ఎఫ్ఏ అధికార ప్రతినిధి అధిపతి ఫాహిమ్ దాస్తీ, జనరల్‌, అబ్దుల్ వదూద్ జోర్ వీరమరణం పొందారు. మీ బలిదానానికి జోహార్లు’ అంటూ ఫేస్‌బుక్‌ వేదికగా నివాళులు అర్పించారు. పాక్‌కు చెందిన ఓ జెట్‌ విమానాన్ని కూల్చేసినట్లు తెలుపుతూ ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని