Mohan Bhagwat: అన్ని వర్గాలవారికి వర్తించేలా.. ఓ ‘జనాభా విధానం’ ఉండాల్సిందే..!

వర్గాల-ఆధారిత జనాభా అసమానత ఓ ప్రధాన అంశమని.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ స్పష్టం చేశారు.

Published : 06 Oct 2022 02:01 IST

నాగ్‌పుర్‌: దేశంలో వివిధ వర్గాల్లో జనాభా అసమానతలపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (RSS) అధినేత మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని వర్గాల వారికి వర్తించేలా ఓ సమగ్ర ‘జనాభా విధానాన్ని’ రూపొందించాలన్నారు. నాగ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన దసరా ర్యాలీలో పాల్గొన్న ఆయన.. వర్గాల-ఆధారిత (Community-based) జనాభా అసమానత ఓ ప్రధాన అంశమని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని ఉద్ఘాటించారు.

‘దేశంలో వివిధ వర్గాల జనాభాలో సమతుల్యత ఉండాల్సిన అవసరం ఉంది. జనాభా అసమానతలు భౌగోళిక సరిహద్దుల్లో మార్పులకు దారితీస్తాయి. కొన్ని వర్గాల్లో జనాభా సమతుల్యత లేని కారణంగా తూర్పు తైమూర్‌, కొసావో, దక్షిణ సూడాన్‌ వంటి కొత్త దేశాలు ఏర్పడ్డాయి’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) పేర్కొన్నారు. జనాభా నియంత్రణకు ప్రయత్నిస్తున్న మనం.. చైనాలో ఏం జరుగుతోందో ఓసారి చూడాల్నారు. ‘ఒకే సంతానం’ విధానాన్ని అవలంబించిన చైనా ఇప్పుడు వృద్ధ దేశంగా మారుతోందన్నారు.

అయితే, 57 కోట్ల యువత కలిగిన భారత్‌.. మరో 30 ఏళ్ల పాటు యువ దేశంగా కొనసాగనుందని మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. ఇదే సమయంలో జనాభాకు అనుగుణంగా వనరులను పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన.. మరో 50 ఏళ్ల తర్వాత భారత్‌కు ఏం జరుగుతుంది..? ఆ జనాభాకు సరిపడా ఆహారం మన దగ్గర ఉంటుందా? అనే విషయంపై శ్రద్ధ వహించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని