Ukraine Crisis: ఐరాసలో భారత్ ఆందోళన.. సుమీలోని విద్యార్థుల తరలింపునకు ముందుకొచ్చిన రష్యా

ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల్ని తరలించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

Updated : 08 Mar 2022 11:46 IST

మానవతా కారిడార్ల ప్రకటన

దిల్లీ: ఉక్రెయిన్‌లోని సుమీ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల్ని తరలించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్‌, రష్యాకు భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. దీని గురించి ప్రధాని నరేంద్రమోదీ ఇరు దేశాల అధ్యక్షులతో స్వయంగా మాట్లాడారు కూడా. ఈ క్రమంలో ఇప్పుడు పౌరుల తరలింపునకు రష్యా ముందుకొచ్చింది. సుమీ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు వెళ్లేందుకు మానవతా కారిడార్లను ఏర్పాటు చేయనుంది. అందుకోసం కాల్పులను తాత్కాలికంగా విరమించనుంది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30కి ఈ ఆపరేషన్ ప్రారంభం కానుంది. ఈ కారిడార్ల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను రష్యాలోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసింది. ఆ జాబితాలో ఉక్రెయిన్ ఈశాన్య నగరమైన సుమీ కూడా ఉంది. అక్కడ సుమారు 600 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. ఎన్నిమార్లు ప్రయత్నించిన వారు ఆ ప్రాంతాన్ని వీడటం కుదరలేదు. ఈ విషయాన్ని లేవనెత్తి నిన్న జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత్ ఆందోళన చెందింది. ఇరు దేశాలను ఎన్ని మార్లు కోరినా.. మానవతా కారిడార్ల ఏర్పాటు మాత్రం సాధ్యం కావడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. అయితే దీనిపై ఉక్రెయిన్ వైపు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.  

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా దాడి కొనసాగుతోంది. సుమీలోని నివాస సముదాయాలపై రష్యా విమానాలు బాంబుల వర్షం కురిపించినట్లు అక్కడి రీజినల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ దిమిత్రో జివిట్స్కీ తెలిపారు. ఈ దాడుల్లో చిన్నారులతో సహా పలువురు మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని