Disqualification Petition: అనర్హతపై సుప్రీంకు లక్షద్వీప్‌ మాజీ ఎంపీ ఫైజల్‌.. రేపు విచారణ

ఓ కేసులో పదేళ్ల జైలు శిక్ష పడిన తనపై లోక్‌సభలో అనర్హత వేటు వేయడాన్ని లక్షద్వీప్‌ మాజీ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై కోర్టు మంగళవారం విచారణ జరపనుంది.

Updated : 27 Mar 2023 12:29 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు నిలబడుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ కేసులో జైలు శిక్ష పడి అనర్హత (Disqualification)కు గురైన లక్షద్వీప్‌ మాజీ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ (Mohammed Faizal) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ముందస్తు విచారణ చేపట్టాలని కోరగా.. సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) అందుకు అంగీకరించింది. ఫైజల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

ఓ హత్యాయత్నం కేసులో ఈ ఏడాది జనవరి 11వ తేదీన కవరత్తి సెషన్స్‌ కోర్టు ఫైజల్‌ (Mohammed Faizal)కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అదే నెల 13వ తేదీన ఆయనపై లోక్‌సభ సెక్రటేరియట్‌ అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత ఆయన తన జైలు శిక్షను కేరళ హైకోర్టులో సవాల్‌ చేయగా.. అక్కడ ఆయనకు ఊరట లభించింది. దీంతో అనర్హత వేటుపై ఆయన ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించినా.. లోక్‌సభ సెక్రటేరియట్‌ తనపై అనర్హతను ఎత్తివేయలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతి రోజు పార్లమెంట్‌కు వచ్చినా.. తనను భద్రతా సిబ్బంది సభ లోపలికి అనుమతించట్లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తనపై లోకసభ సచివాలయం విధించిన అనర్హతను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

కాగా.. తన పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఫైజల్‌ (Mohammed Faizal) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ ధర్మాసనం వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఫైజల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు సీజేఐ ధర్మాసనం వెల్లడించింది.

ఇదీ చదవండి: రాహుల్‌పై వేటు నిలబడుతుందా..

రాహుల్‌ గాంధీపై అనర్హత సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ ఇంటి పేరును కించపర్చారన్న కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడటంతో ఇటీవల ఆయనపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. అయితే ఈ తీర్పుపై రాహుల్‌ ఇంకా పైకోర్టులో అప్పీలు చేయలేదు. అయితే ఫైజల్‌ (Mohammed Faizal) ‘అనర్హత’ కేసు ఇంకా కొలిక్కి రాకపోవడంతో.. రాహుల్‌ అప్పీలుకు వెళ్తే ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని