External Ministry: ‘మీలా మతోన్మాదులకు స్మారకాలు కట్టడంలేదు’.. పాక్‌పై భారత్‌ నిప్పులు

మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ భారత్‌లోని మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తిప్పికొట్టింది.......

Published : 06 Jun 2022 19:36 IST

దిల్లీ: అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ భారత్‌లోని మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తిప్పికొట్టింది. నిత్యం మైనారిటీ హక్కులను ఉల్లంఘించే ఓ దేశం.. మరో దేశంలోని మైనారిటీల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లా మేము మతోన్మాదులను కీర్తించడం, వారి గౌరవార్థం స్మారక చిహ్నాలను నిర్మించడం లేదని వ్యాఖ్యానించారు.

‘పదేపదే మైనారిటీ హక్కులను ఉల్లంఘించే ఓ దేశం.. మరో దేశంలోని మైనారిటీల గురించి వ్యాఖ్యానించడం అసంబద్ధంగా ఉంది. మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, అహ్మదీయులపై ఎక్కడ హింసలు జరుగుతున్నాయో ప్రపంచం చూస్తూనే ఉంది’ అని అరిందమ్‌ బాగ్జీ ట్విటర్‌ వేదికగా పాక్‌పై మండిపడ్డారు. ‘భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తుంది. ఇది పాకిస్థాన్‌ తరహాలో మతోన్మాదులను కీర్తించడం, వారి గౌరవార్థం స్మారక చిహ్నాలను నిర్మించడం లాంటిది కాదు. మీ దేశంలోని మైనారిటీ కమ్యూనిటీల భద్రత, శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని పాకిస్థాన్‌ను కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. భారత్‌లో మతసామరస్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.

అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ భారత దౌత్యవేత్తకు పాక్‌ సమన్లు జారీ చేసింది. భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్​లోని ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల మనోభావాలను దెబ్బతీశాయని వ్యాఖ్యానించింది. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆదివారం ఓ ట్వీట్‌ చేస్తూ.. మోదీ ఆధ్వర్యంలోని భారత్‌ మత స్వేచ్ఛను తుంగలో తొక్కి, ముస్లింలను హింసిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు దీన్ని గమనించి భారత్‌ను మందలించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ ప్రతినిధి దీటుగా స్పందించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని