cyclone yaas: 3 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘యాస్‌’ తుపానుగా మారిన విషయం తెలిసిందే.  సోమవారం రాత్రికి బలపడిన ఈ తుపాను మంగళవారం మధ్యాహ్నం సమయానికి  తీవ్ర తుపానుగా మారనున్నట్లు  భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Updated : 25 May 2021 13:38 IST

భారత వాతావరణ శాఖ వెల్లడి

దిల్లీ: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘యాస్‌’ తుపానుగా మారిన విషయం తెలిసిందే.  సోమవారం రాత్రికి బలపడిన ఈ తుపాను మంగళవారం మధ్యాహ్నం సమయానికి  తీవ్ర తుపానుగా మారనున్నట్లు  భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ఉదయానికి వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు వెళ్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తుపాను బుధవారం తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వారు తెలిపారు.  మంగళవారం ఉదయానికి యాస్‌ తుపాను పారాదీప్‌కు ఆగ్నేయంలో 360 కిలోమీటర్లు, బాలాసోర్‌కు ఆగ్నేయంగా 460 కిలోమీటర్లు, దిఘాకు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం తుపాను తీరం దాటే సమయంలో గంటకు 165 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వారు వెల్లడించారు. మే 26 వరకు తీరంలో కఠిన పరిస్థితులు ఉండనున్న నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

యాస్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం బలగాలను అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌తో భారత వాయుసేన సిద్ధంగా ఉంది. ముందస్తు హెచ్చరికలతో ఈశాన్య రైల్వే కూడా పలు సర్వీసులను రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని