Smriti Irani: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి పలుచోట్ల నిరసన సెగ

కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీకి మహారాష్ట్రలోని పుణెలో పలుచోట్ల నిరసన సెగలు తగిలాయి. దేశంలో ఇంధన, ...

Published : 17 May 2022 01:41 IST

పుణె: కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీకి మహారాష్ట్రలోని పుణెలో పలుచోట్ల నిరసన సెగలు తగిలాయి. దేశంలో ఇంధన, నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌, ఎన్సీపీ శ్రేణులు వేర్వేరుగా ఆందోళనకు దిగాయి. తొలుత మహిళా కాంగ్రెస్‌కు చెందిన కొందరు మహిళలు స్మృతి ఇరానీ కార్యక్రమం జరుగుతున్న ఓ హోటల్‌ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ద్రవ్యోల్బణం, ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ మధ్యాహ్నం 12గంటల సమయంలో హోటల్‌ వద్ద నినాదాలు చేశారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో కేంద్రం విఫలమైందంటూ ఆందోళన కొనసాగించారు. కొందరు మహిళలు ఆమెను కలిసేందుకు లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వదిలి పెట్టారు.

మరోవైపు, ఎన్సీపీ కార్యకర్తలు కూడా మరో చోట నిరసనకు దిగారు. స్మృతి ఇరానీ బస చేస్తున్న ఓ హోటల్‌ వద్ద ఆందోళన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. అలాగే, సాయంత్రం మరోచోట కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనకు దిగాయి. నగరంలోని బాల్‌ గాంధర్వ ఆడిటోరియం వద్ద జరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజకీయ ప్రయాణంపై రచించిన పుస్తకం మరాఠీ వెర్షన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనగా.. నినాదాలు చేశారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేసినట్టు పుణె నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రమేశ్‌ బాగ్వే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని