Supreme Court: నిర్మాత ఏక్తా కపూర్‌కు సుప్రీం చీవాట్లు.. అరెస్టు వారెంట్లు జారీ

వెబ్‌ సిరీస్‌ ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్‌’లోని అభ్యంతరకరమైన కంటెంట్‌ నేపథ్యంలో నిర్మాత ఏక్తా కపూర్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 15 Oct 2022 10:06 IST

దిల్లీ: వెబ్‌ సిరీస్‌ ‘ఎక్స్‌ఎక్స్‌ఎక్స్‌’లోని అభ్యంతరకరమైన కంటెంట్‌ నేపథ్యంలో నిర్మాత ఏక్తా కపూర్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ యువతరం ఆలోచనలను ఆమె కలుషితం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఓటీటీ ప్లాట్‌ఫాం ఏఎల్‌టీ బాలాజీలో ప్రసారమైన వెబ్‌సిరీస్‌లో సైనికులను కించపరిచారని, వారి కుటుంబసభ్యుల నమ్మకాలను గాయపరిచారన్న ఆరోపణలపై ఏక్తా కపూర్‌పై అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. వాటిని సవాలు చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేస్తూ కేసును వాయిదా వేసింది.

బాణసంచా అంశంపై తక్షణ విచారణకు నిరాకరణ

బాణసంచాపై నిషేధం అంశంలో తక్షణ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ‘‘క్షమించండి. ఆ అంశాన్ని ఇప్పుడు మేం విచారణ జాబితాలో చేర్చలేం. దీపావళి దగ్గరకు వచ్చేసింది. మీరు చివరి క్షణంలో న్యాయస్థానం ముందుకొచ్చారు. అనేకమంది బాణసంచా వ్యాపారంలో ఇప్పటికే పెట్టుబడి పెట్టేసి ఉంటారు. మీరు రెండు నెలల ముందే వచ్చి ఉండాల్సింది’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. బాణసంచా వినియోగం మొత్తంపై నిషేధం లేదని..బేరియం సాల్ట్స్‌తో కూడిన వాటిపై మాత్రమేనని గతేడాది సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది.

న్యాయవ్యవస్థకు జస్టిస్‌ హేమంత్‌ గుప్తా గొప్ప ఆస్తి: సీజేఐ

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ గుప్తాపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ శుక్రవారం ప్రశంసలు కురిపించారు. ఆయన న్యాయవ్యవస్థకు గొప్ప ఆస్తి వంటివారని శ్లాఘించారు. జస్టిస్‌ గుప్తా ఈ నెల 16న పదవీ విరమణ చేయనున్నారు. ‘‘జస్టిస్‌ గుప్తా ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన ఆకాంక్షలన్నీ నెరవేరాలని మేమంతా కోరుకుంటున్నాం’’అని జస్టిస్‌ లలిత్‌ పేర్కొన్నారు. జస్టిస్‌ గుప్తా నవంబరు 2, 2018లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

నళిని ముందస్తు విడుదల అభ్యర్థనపై విచారణ వాయిదా

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవితఖైదును అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌... తనను విడుదల చేయాలని వేసిన కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. కోర్టు సమయం మించిపోవడంతో న్యాయమూర్తులు జస్టిస్‌ బి.ఆర్‌.గవై, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం కేసును విచారణకు స్వీకరించలేకపోయింది. ఈ హత్య కేసులో దోషులైన నళిని, ఆర్‌.పి. రవిచంద్రన్‌లను విడుదల చేయాలని గురువారం తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఈ కేసులో ఏడుగురు దోషుల క్షమాభిక్ష అర్జీని పరిగణనలోకి తీసుకున్నామని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 161 ప్రకారం వారి శిక్ష రద్దుకు గవర్నర్‌కు సిఫార్సు చేయాలని 2018 సెప్టెంబరు 9న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు వివరిస్తూ సుప్రీంకోర్టులో రెండు అఫిడవిట్లను వేసింది. రాజీవ్‌గాందీని 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ఉండగా మానవ బాంబును పేల్చి హత్య చేశారు. ఈ కేసులో కోర్టు పెరారివలన్‌, మురుగన్‌, శంతన్‌, నళినిలకు మరణశిక్ష విధించింది. అమలులో జాప్యం కారణంగా వారి మరణశిక్షను నిలిపేసింది. ఈ కేసులో దోషులంతా ఇప్పటికే 23 ఏళ్లపాటు జైలుశిక్ష అనుభవించారు. ప్రస్తుతం నళిని, రవిచంద్రన్‌ ఇద్దరూ 2021 డిసెంబరు 27 నుంచి సాధారణ బెయిల్‌పై ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని