
Taliban: విదేశీ కరెన్సీలు చెల్లవు.. తాలిబన్ల హుకుం..!
ఇంటర్నెట్‌డెస్క్: అఫ్గానిస్థాన్‌లో విదేశీ కరెన్సీల వినియోగంపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇప్పటికే పతనం అంచున ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇదొక శరాఘాతంగా మారనుంది. ‘‘దేశ ఆర్థిక పరిస్థితి అవసరాల దృష్ట్యా అఫ్గానీలు లావాదేవీల్లో దేశీయ కరెన్సీని వినియోగించాలి. ఇక నుంచి దేశప్రజలు, వర్తకులు, వ్యాపారులు నిర్వహించే నగదు లావాదేవీలు మొత్తం అఫ్గానిస్థాన్ కరెన్సీలోనే ఉండాలి. విదేశీ కరెన్సీ వినియోగం నుంచి కచ్చితంగా బయటపడాలి. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లాహ్ ముజాహిద్ పేర్కొన్నారు. అమెరికా సేనలు ఉన్న సమయంలో అఫ్గానిస్థాన్‌లో అత్యధికంగా డాలర్‌నే వినియోగించేవారు. కానీ, అమెరికన్లు అక్కడి నుంచి వెళ్లిపోయాక డాలర్ల సరఫరా నిలిచిపోయింది. దీనికి తోడు చాలా సొమ్ము అమెరికా వద్దే ఉంది.
అఫ్గాన్ నిధులు అమెరికా వద్దే..
అమెరికా ఫెడ్ వద్ద దాదాపు 9 బిలియన్ డాలర్ల అఫ్గాన్ రిజర్వులు ఉన్నాయి. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించిన తర్వాత అమెరికా వాటిని స్తంభింపజేసింది. వీటిని విడుదల చేయాలని ఇప్పటికే తాలిబన్లు పలుమార్లు కోరారు. కానీ, డాలర్ రూపంలో ఉన్న ఆ నిధులను స్తంభిపజేయడం అత్యవసరమని ట్రెజరీ సెక్రటరీ వాలీ అడ్యెమో పేర్కొన్నారు. దీనికి తోడు విదేశీ సహాయం మొత్తం నిలిచిపోయింది. గతంలో ప్రభుత్వ వ్యయంలో మూడో వంతు ఇదే ఉండేది. ఇక ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు నిధుల సరఫరాను నిలిపివేశాయి. దీంతో మిలియన్ల మంది పేదరికంలోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.