కిలో ‘గోల్డ్‌ టీ’ పొడి ధర రూ. 99,999.. వేలంలో రికార్డు

‘మనోహరి గోల్డ్​ టీ’ రికార్డు ధర​ నమోదు చేసింది. వేలంలో కిలో టీ పొడి రూ. 99,999కు అమ్ముడుపోయింది. దేశంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర......

Published : 15 Dec 2021 01:44 IST

గువాహటి: భారత్‌లో చాయ్​కు ఉన్న ఆదరణే వేరు. అందులోనూ అస్సాం టీ పొడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అక్కడ ఉత్పత్తయ్యే చాయ్‌ పొడికి మంచి డిమాండ్​ ఉంటుంది. పలు అరుదైన రకాలకు చెందిన టీ పొడులను ఏటా పలు సంస్థలు వేలం వేస్తాయి. ఈ క్రమంలో మంగళవారం ‘మనోహరి గోల్డ్​ టీ’ రికార్డు ధర​ నమోదు చేసింది. వేలంలో కిలో టీ పొడి రూ. 99,999కు అమ్ముడుపోయింది. దేశంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ధర.

ఈ గోల్డ్​​ టీని మనోహరి టీ ఎస్టేట్స్‌ నుంచి సౌరవ్​ టీ ట్రేడర్స్​ అనే సంస్థ కొనుగోలు చేసినట్లు గువాహటి టీ వేలం సెంటర్​ (జీటీఏసీ) కార్యదర్శి ప్రియాన్ష్‌ దత్తా వెల్లడించారు. టీ పొడి కొనుగోలు, విక్రయాల్లో దేశంలోనే ఇది అత్యధిక ధర అని ఆయన తెలిపారు. ఈ తరహా టీలకు విదేశాల్లో కూడా డిమాండ్​ పెరుగుతుందని ఆశిస్తున్నానని దత్తా పేర్కొన్నారు.

పసుపు రంగులో ఉండి అద్భుతమైన రుచిని అందించే మనోహరి గోల్డ్‌ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని పేరుంది. 2019 జులైలో వేలం నిర్వహించగా ఈ పొడి కేజీ రూ. 50వేలకు అమ్ముడుపోయి రికార్డు నెలకొల్పింది. అయితే కొద్దిరోజులకే ఈ రికార్డు బద్దలైంది. ‘గోల్డెన్‌ నెడ్డిల్స్‌ టీ’తోపాటు ‘గోల్డెన్‌ బటర్‌ఫ్లై టీ’లు రూ. 75వేలకు అమ్ముడుపోయాయి. కాగా ఈ రికార్డును ప్రస్తుతం మనోహరి గోల్డ్‌ టీ తిరగరాసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని