Corona: ఆ దేశాల నుంచి వచ్చిన ఆరుగురు ప్రయాణికులకు కరోనా..!

ప్రమాదం పొంచి ఉన్న(ఎట్‌ రిస్క్) దేశాల నుంచి మహారాష్ట్రకు చేరుకున్న ఆరుగురు అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

Updated : 01 Dec 2021 16:25 IST

ముంబయి: ప్రమాదం పొంచి ఉన్న దేశాల నుంచి మహారాష్ట్రకు చేరుకున్న ఆరుగురు అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ఆ జాబితాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను గుర్తించిన దేశాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తుల్లో కొందరికి లక్షణాలు కనిపించలేదని, మరికొందరిలో స్వల్పస్థాయి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు పేర్కొంది. ఆ జాబితాలో యూకేతో పాటు ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బోట్సువానా, బ్రెజిల్, బంగ్లాదేశ్‌, హాంకాంగ్, ఇజ్రాయెల్, న్యూజిలాండ్ ఉన్నాయి.

మహారాష్ట్రలో ఏడు రోజుల సంస్థాగత క్వారంటైన్‌..
ఒమిక్రాన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో.. దేశంలోని విమానాశ్రయాల్లో ఈ రోజు నుంచి కట్టడి చర్యలు కఠినతరమయ్యాయి. ప్రమాదం పొంచి ఉన్న జాబితాలోని దేశాల నుంచి వచ్చే పౌరులకు పరీక్షలు చేయడంతోపాటు కఠిన క్వారంటైన్ నియమాలు అమలవుతున్నాయి. ఆ ప్రయాణికులు పరీక్షల అనంతరం ఫలితం తేలకుండా విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లడానికి వీలు లేదు. నెగెటివ్ అని తేలితే.. ఏడు రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. మహారాష్ట్రకు చేరుకునే ప్రయాణికులంతా తప్పనిసరిగా ఏడు రోజుల సంస్థాగత క్వారంటైన్‌లో ఉండాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని