Gamblers: థాయ్‌లాండ్‌లో 83 మంది భారత గ్యాంబ్లర్ల అరెస్టు

థాయ్‌లాండ్‌ (Thailand)లో పెద్ద సంఖ్యలో భారతీయ గ్యాంబ్లర్లు (Gamblers) అరెస్టయ్యారు. ఓ హోటల్లో జరిపిన దాడుల్లో పోలీసులు వీరిని పట్టుకున్నారు.

Updated : 01 May 2023 22:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: థాయ్‌లాండ్‌ (Thailand)లో భారీ ఎత్తున జరుగుతున్న గ్యాంబ్లింగ్‌ (Gambling)ను అక్కడి స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. పటాయాలోని ఓ లగ్జరీ హోటల్‌లో 93 మంది గ్యాంబ్లర్లను అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా ఓ కథనంలో వెల్లడించింది. ఇందులో 83 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.

బాంగ్‌ లామంగ్‌ జిల్లాలోని ఆసియా పటాయా హోటల్‌లో సోమవారం తెల్లవారుజామున జరిపిన తనిఖీల్లో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. పోలీసులు హోటల్‌లోకి ప్రవేశించిన సమయంలో పెద్ద సంఖ్యలో గ్యాంబ్లర్లు (Gamblers) అక్కడ గేమ్‌లు నిర్వహిస్తున్నారు. వీరిని చూడగానే నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. మొత్తం 93 మందిని అరెస్టు చేశారు. అందులో చికోటి ప్రవీణ్‌ సహా 83 మంది భారతీయ గ్యాంబ్లర్లు, ఆరుగురు థాయ్‌, నలుగురు మయన్మార్‌ దేశస్థులు ఉన్నట్లు సదరు మీడియా కథనం వెల్లడించింది. అరెస్టు అయిన భారతీయుల్లో చికోటి ప్రవీణ్‌ అనుచరుడు మాధవరెడ్డి, మరికొంత మంది రాష్ట్రానికి చెందిన ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.

నిందితుల నుంచి రూ.1.60లక్షల భారతీయ కరెన్సీ, 20 కోట్ల గ్యాంబ్లింగ్‌ చిప్స్‌, 92 మొబైల్ ఫోన్లు, 8 సీసీటీవీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హోటల్‌లో సుమారు ₹100కోట్ల మేర గ్యాంబ్లింగ్‌ జరుగుతున్నట్లు పోలీసులు అంచనా వేశారు. నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు హోటల్‌లో సోదాలు జరపగా ఈ గ్యాంబ్లింగ్‌ గుట్టు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంబ్లింగ్‌కు ఉపయోగించిన పరికరాలన్నింటినీ భారత్‌ నుంచే తీసుకొచ్చినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని