The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’కి మధ్యప్రదేశ్‌ పన్ను మినహాయింపు

The Kerala Story Tax free in MP: ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Published : 06 May 2023 15:10 IST

భోపాల్‌: మత మార్పిడిలపై రూపొందిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం (Madhya Pradesh) పన్ను మినహాయింపు ప్రకటించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (Shivraj Singh Chouhan) ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. పిల్లలు, పెద్దలూ అందరూ తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలన్నారు. ‘మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే మత మార్పిడుల నిరోధానికి చట్టం తీసుకొచ్చింది. ఈ చిత్రం కూడా మతమార్పిడులపై అవగాహన తీసుకొస్తోంది. కాబట్టి తల్లిదండ్రులు, చిన్నారులు, ఆడ పిల్లల అందరూ వీక్షించదగ్గ చిత్రం. అందుకే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను రాయితీ ఇస్తోంది’’ అని చౌహాన్‌ అన్నారు.

అదా శర్మ నటించిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) చిత్రాన్ని విపుల్‌ షా నిర్మించగా, సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించారు. బహుభాషా చిత్రమైన కేరళ స్టోరీ శుక్రవారం దేశమంతటా విడుదలైంది. విడుదల సందర్భంగా కేరళ, తమిళనాడులలో థియేటర్ల ముందు నిరసన ప్రదర్శనలు జరిగాయి. చెన్నైలో కొన్ని థియేటర్లు ఈ చిత్ర ప్రదర్శనను నిలిపేశాయి. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఈ చిత్రాన్ని తప్పుబట్టింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఈ చిత్రం గురించి ప్రధాని మోదీ శుక్రవారం ప్రస్తావించారు. ప్రకృతి అందాలకు నెలవైన  రాష్ట్రంలో ఉగ్ర కుట్రలను ‘కేరళ స్టోరీ’ బయటపెట్టిందని మోదీ అన్నారు. అలాంటి చిత్రాన్ని వ్యతిరేకిస్తూ.. ఉగ్రవాదులకు కాంగ్రెస్‌ వంతపాడుతోందని విమర్శించారు. ఆ మరుసటి రోజే మధ్యప్రదేశ్‌ నుంచి ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని