Voter ID: ఆచరణ సాధ్యం కాదనుకున్న కార్డు.. ‘చిరునామా’కు మారుపేరుగా నిలిచి!

ఓటరు కార్డు (Voter ID)కు 1957లోనే రూపకల్పన చేసినప్పటికీ.. పూర్తిస్థాయిలో అది కార్యరూపం దాల్చేందుకు దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది.

Published : 12 Mar 2024 20:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించే ఎన్నికల నిర్వహణ ఒక సవాల్‌ అనే చెప్పవచ్చు. ఎటువంటి అక్రమాలకు తావులేకుండా వీటిని నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) పలు చర్యలు చేపడుతోంది. ఇందులో కీలకమైన ఓటరు కార్డు (Voter ID)కు 1957లోనే రూపకల్పన చేసినప్పటికీ.. పూర్తిస్థాయిలో అది కార్యరూపం దాల్చేందుకు దాదాపు మూడు దశాబ్దాలు పట్టింది. ఒకరికి బదులు మరొకరు ఓటు వేయకుండా నిరోధించడంలో కీలకమైన ఈ ఓటరు కార్డును 1993లో అందుబాటులోకి తేగా.. ప్రస్తుతం అది ఓటరు గుర్తింపుగానే కాకుండా వ్యక్తుల చిరునామా ధ్రువీకరణ పత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.

తొలి ప్రయత్నం విఫలం..

ఓటర్లకు ఫొటో ఐడీ కార్డులను జారీ చేసే ప్రక్రియను తొలిసారిగా 1960లో చేపట్టారు. కలకత్తా (సౌత్‌-వెస్ట్‌) పార్లమెంటరీ నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో పైలట్‌ ప్రాజెక్టు కింద వీటిని అందజేశారు. కానీ, పూర్తిస్థాయిలో విజయవంతం కాకపోవడంతో దాదాపు రెండు దశాబ్దాల పాటు అది అటకెక్కింది. మళ్లీ 1979లో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీటిని జారీ చేయగా.. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌లలోనూ తీసుకొచ్చారు. ఇవే 1993లో దేశవ్యాప్త ఫొటో ఐడీ జారీకి నాంది పలికాయి. వీటికి సంబంధించి ప్రజాప్రాతినిధ్య (సవరణ) బిల్లు -1958లో ఓ ఆసక్తికర నిబంధన ఉంది. భారత్‌లో ఎన్నికల ప్రయాణంపై ఈసీ ప్రచురించిన ‘లీప్‌ ఆఫ్‌ ఫెయిత్‌ (Leap of Faith)’ పుస్తకంలో పేర్కొన్నారు.

దిగువ సభలో నవంబర్‌ 27, 1958న ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని చూసి సంతోషం అనిపించిందని భారత తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (CEC) సుకుమార్‌ సేన్‌ రిటైర్మెంట్‌ సమయంలో వెల్లడించారు. బిల్లును ప్రవేశపెట్టిన అప్పటి న్యాయశాఖ మంత్రి అశోక్‌కుమార్‌ సేన్‌.. సుకుమార్‌ సేన్‌ తమ్ముడు కావడం విశేషం. చివరకు డిసెంబర్‌ 30, 1958న ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. అప్పటికే రెండో ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా కేవీకే సుందరం బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్‌ 20, 1958 నుంచి సెప్టెంబర్‌ 30, 1967 వరకు పదవిలో ఉన్న ఆయన.. సుదీర్ఘకాలం సీఈసీగా కొనసాగిన వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు. 1957 సార్వత్రిక ఎన్నికల తర్వాత, రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఫొటోలతో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేయడం వల్ల పోలింగ్‌ సమయంలో ఓటర్లను గుర్తించడం తేలిక అవడంతోపాటు దొంగ ఓట్లను (impersonation) నివారించవచ్చని అప్పట్లో ఇచ్చిన నివేదికలో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

కారణాలు ఇవే..

కలకత్తా (సౌత్‌-వెస్ట్‌)లో 3.42 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 10 నెలలు కష్టపడి 2.13 లక్షల ఓటర్ల ఫొటోలను మాత్రమే సేకరించగలిగారు. ఇందులో 2.10 లక్షల మందికి ఫొటో ఐడీ కార్డులు జారీ చేశారు. ఇందుకు కారణం.. మహిళా ఓటర్లు ముందుకు రాకపోవడమేనట. మహిళా, పురుష ఫొటోగ్రఫర్లను నియమించినప్పటికీ మహిళా ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాదు, కేవలం ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు కలకత్తా ప్రాంతానికే రూ.25 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఖర్చుపరంగా అదనపు భారం కావడం, కమిషన్‌లో మిషనరీపై సమీక్ష జరిపిన ఈసీ.. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. కలకత్తా లేదా దేశవ్యాప్తంగా సంతృప్తికర స్థాయిలో ఈ ప్రక్రియ చేపట్టడం ఆచరణ సాధ్యం కాదని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చింది.

ఇలా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదు. చివరకు 1993లో ఓటరు కార్డుల జారీకి మళ్లీ శ్రీకారం చుట్టారు. క్రమంలో దేశవ్యాప్తంగా ప్రతీ ఓటరుకు గుర్తింపుకార్డు ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేసింది. 2021లో ఎలక్ట్రానిక్‌ ఎలక్టోరల్‌ ఫొటో ఐడీ కార్డుల (EPIC)ను తీసుకొచ్చారు. పీడీఎఫ్‌లో ఉండే ఈ డిజిటల్‌ కార్డును మార్చేందుకు వీలులేకుండా రూపొందించారు. ఓటరు వివరాలతోపాటు క్యూఆర్‌కోడ్‌నూ పొందుపరిచిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు