PM Modi:: మణిపుర్‌లో సమయానికి కేంద్రం జోక్యం చేసుకొంది : మోదీ

కేంద్ర ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడం వల్లనే మణిపుర్‌లో పరిస్థితి మెరుగుపడిందని ప్రధాని మోదీ అన్నారు. ఆ రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Published : 08 Apr 2024 19:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకొన్న వేళ సమయానికి కేంద్రం జోక్యం చేసుకోవడం వల్లే పరిస్థితి మెరుగుపడిందని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఆయన అస్సాం ట్రిబ్యూన్‌ పత్రికతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొందని చెప్పారు. మణిపుర్‌లో నెలకొన్న సున్నితమైన పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

కేంద్రం తన వద్ద ఉన్న అత్యున్నత శ్రేణి వనరులను ఈ రాష్ట్రంలో సమస్యను పరిష్కరించేందుకు వినియోగిస్తోందని మోదీ వివరించారు. ‘‘అక్కడ సమస్య తీవ్రంగా ఉన్నవేళ హోం మంత్రి అమిత్‌ షా మణిపుర్‌లోనే ఉన్నారు. దాదాపు వివిధ వర్గాలతో 15కు పైగా సమావేశాలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అవసరాల మేరకు కేంద్రం కూడా నిరంతరం తన మద్దతు కొనసాగించింది. సహాయ, పునరావాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. శిబిరాల్లో జీవిస్తున్న ప్రజల కోసం ఆర్థిక ప్యాకేజీలు వంటి చర్యలు తీసుకొన్నాం’’ అని ప్రధాని తెలిపారు. ఈశాన్య భారత్‌ అభివృద్ధికి కేంద్రం చాలా చర్యలు తీసుకొందన్నారు. 2014 నుంచి ఆ ప్రాంతంలో విద్య కోసమే రూ.14 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. తొలి స్పోర్ట్స్‌ యూనివర్శిటీని మణిపుర్‌లోనే ప్రారంభించామన్నారు. ఈశాన్య భారత్‌లోని 8 రాష్ట్రాల్లో కలిపి 200 ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. గత పదేళ్లలో ఆ ప్రాంతంలో 4,000 స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయన్నారు. 

గతేడాది మే ఆదివాసీల సంఘీభావ ర్యాలీ తర్వాత నుంచి ఇక్కడి జాతుల మధ్య వైరం తీవ్రమైంది. మైతేయిలకు ఎస్టీ కోటా ఇవ్వాలన్న డిమాండ్‌కు వ్యతిరేకంగా ఈ ర్యాలీ చేపట్టారు. ఇప్పటివరకు 160 మంది హింసలో ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రాష్ట్రంలో పరిస్థితికి కేంద్ర వైఖరే కారణమని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అంతేకాదు.. ప్రధాని మోదీ ఆ రాష్ట్రాన్ని ఇప్పటివరకు సందర్శించకపోవడాన్ని తప్పు పడుతోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని