Tamil nadu: పట్టపగలే రెండు హత్యలు.. పోలీసులపై గ్రెనేడ్ దాడులు.. ఇద్దరు నిందితుల హతం

తమిళనాడు చెంగల్​పట్టు జిల్లాలో సంచలనం రేపిన ఇద్దరు యువకుల హత్య ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను ఎన్​కౌంటర్​ చేశారు......

Published : 07 Jan 2022 16:15 IST

చెన్నై: తమిళనాడు చెంగల్​పట్టు జిల్లాలో సంచలనం రేపిన ఇద్దరు యువకుల హత్య ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను ఎన్​కౌంటర్​ చేశారు. మరో ఇద్దరిని అరెస్ట్​ చేశారు. కేసు దర్యాప్తు క్రమంలో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో వారు గ్రెనేడ్​ దాడికి పాల్పడ్డారని, ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. వారి దాడిలో తమకు గాయాలైనట్లు తెలిపారు.

అసలేం జరిగిందంటే..

చెంగల్​పట్టు జిల్లా కేంద్రానికి చెందిన అప్పు అలియాస్​ కార్తిక్​.. గురువారం ఓ టీ షాప్​నకు వెళ్లాడు. ఆ సమయంలో ముగ్గురు దుండగులు ద్విచక్రవాహనంపై కార్తిన్‌ను వెంబడించారు. కొద్ది దూరం వెళ్లగానే అతడిపై గ్రెనేడ్​ దాడి చేశారు. కార్తిన్‌ కిందపడిపోగానే కత్తులతో విచక్షణారహితంగా పొడిచి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అదే గ్యాంగ్​ ఆ తర్వాత మరో హత్యకు పాల్పడింది. చెంగల్​పట్టు ప్రాంతానికి చెందిన కూరగాయల వ్యాపారి శ్రీనివాస్​ కుమారుడు మహేశ్​ను హతమార్చారు. ఇంట్లో ఒక్కడే ఉండగా ఇంట్లోకి చొరబడి కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని, మృతదేహాలను శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టపగలు, అత్యంత రద్దీ ప్రాంతాల్లో రెండు హత్యలు జరగటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. దినేశ్​, మొహిదీన్​ అనే ఇద్దరితోపాటు మరికొందరిని నిందితులుగా గుర్తించారు. దినేశ్​, మొహిదీన్​ అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో.. వారిని పట్టుకునేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. అయితే నిందితులు పోలీసులపై సైతం గ్రెనేడ్​ దాడికి పాల్పడ్డారు​. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని ఎన్​కౌంటర్​ చేశారు. ఈ హత్యలకు సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గ్రెనేడ్‌ దాడిలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని