Beaches: భారత్‌లో ఆ బీచ్‌లకు అరుదైన గౌరవం

 ప్రపంచ పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో కేరళలోని ‘కోవలం’, పుదుచ్చేరిలోని ‘ఈడెన్’ బీచ్‌లు తాజాగా చోటు సంపాదించుకున్నాయి. ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచులుగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాయి. 

Published : 25 Sep 2021 01:24 IST

 కేరళ ‘కోవలం’, పుదుచ్చేరిలోని ‘ఈడెన్’ బీచ్‌లకు ‘బ్లూఫ్లాగ్‌’ ట్యాగ్‌
 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ పరిశుభ్ర బీచ్‌ల జాబితాలో కేరళలోని ‘కోవలం’, పుదుచ్చేరిలోని ‘ఈడెన్’ బీచ్‌లు తాజాగా చోటు సంపాదించుకున్నాయి. ‘బ్లూ ఫ్లాగ్‌’ బీచులుగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాయి. గతేడాది దేశంలోని ఎనిమిది బీచ్‌లు ‘బ్లూ ఫ్లాగ్‌’ ట్యాగ్‌ పొందగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ ‘రుషికొండ’ బీచ్‌ కూడా ఉంది. కేరళ ‘కోవలం’, పుదుచ్చేరిలోని ‘ఈడెన్’ బీచ్ లతో కలిపి.. గతంలో ఎనిమిదిగా ఉన్న సంఖ్య కాస్త 10కి చేరింది. ఇదే విషయాన్ని ట్విటర్‌ వేదికగా కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ వెల్లడించారు. భారత్‌లో శివరాజ్‌పూర్-గుజరాత్, ఘోగ్లా -డయ్యూ, కాసర్‌కోడ్, పదుబిద్రి-కర్ణాటక, కప్పడ్-కేరళ, రుషికొండ- ఆంధ్రప్రదేశ్‌, గోల్డెన్-ఒడిశా, రాధానగర్, అండమాన్ నికోబార్ ‘బ్లూ ఫాగ్‌’ ధ్రువపత్రం పొందిన జాబితాలో ఉన్నాయి.

 ‘బ్యూ ఫ్లాగ్‌’ ధ్రువపత్రం వేటికి ఇస్తారంటే..?
డెన్మార్క్‌కి చెందిన పర్యావరణ అవగాహన సంస్థ ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌’ (FEE) అనే  సంస్థ... బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్‌లు ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ సంస్థ సర్టిఫికెట్‌ పొందడం అంత ఆషామాషీ కాదు. బీచ్‌లకు సంబంధించి అనేక స్థాయిల్లో పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, పరిశుభ్రత నిర్వహణ, బీచ్‌ల వద్ద భద్రత, సేవలు.. ఇలా 33 ప్రమాణాలను పరిశీలించి వాటికి అనుగుణంగా ఉంటేనే ఈ ట్యాగ్‌ అందజేస్తారు. ప్రపంచం మొత్తంలో బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌లను పరిశుభ్రమైన బీచ్‌లుగా పరిగణిస్తారు.

ఇదే పర్యాటకులకు కలిగే లాభం..
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పర్యాటకం మీదే ఆధారపడి అభివృద్ధి చెందుతున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సమయం గడిపేందుకు బ్లూ ట్యాగ్‌లు పొందిన బీచ్‌లు శ్రేయస్కరం. ముఖ్యంగా స్నానం చేయడానికి స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణం, చుట్టూ పరిశుభ్రత ఇక్కడ ఉంటుంది. అందుకే మిగితా బీచ్‌లతో పోలిస్తే బ్లూ ట్యాగ్‌ బీచ్‌లను సందర్శించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 2018 జూన్ 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీచ్‌లను శుభ్రం చేయడానికి భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ ‘ఐ యామ్ సేవింగ్ మై బీచ్’ ప్రచారం ప్రారంభించింది. దేశంలోని 13 తీర రాష్ట్రాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని