Sudan coup: సూడాన్‌కు అమెరికా భారీ షాక్‌.. ఏం చేసిందంటే?

సూడాన్‌లో తాజాగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం.. తాత్కాలిక ప్రధాని అబ్దుల్లా హమ్‌డోక్‌ సహా పలువురు అధికారులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి...

Published : 26 Oct 2021 14:58 IST

వాషింగ్టన్‌: సూడాన్‌లో తాజాగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం.. తాత్కాలిక ప్రధాని అబ్దుల్లా హమ్‌డోక్‌ సహా పలువురు అధికారులను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇదిలా ఉండగా.. తాజాగా అమెరికా ఈ తిరుగుబాటు చర్యను తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో సూడాన్‌కు 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సూడాన్‌ ప్రధానితోపాటు అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. దేశంలో ప్రజా అధికారాన్ని పునరుద్ధరించాలని సూచించింది. అయితే.. ప్రస్తుతానికి నిలిపివేసిన 700 మిలియన్ డాలర్లతోపాటు సూడాన్‌కు అమెరికా ఎంత సాయం అందచేయనుందో పూర్తి వివరాలు తెలియరాలేదు.

‘ఆంక్షలు విధించేందుకు వెనుకాడబోం..’

ఈ వ్యవహారంపై అమెరికా అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ మాట్లాడుతూ.. తిరుగుబాటు అనేది సూడాన్‌ పౌరుల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు తూట్లుపొడవడమేనని, దేశ రాజ్యాంగ విధానాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఆందోళనకారులపై హింసాత్మక ధోరణి అవలంబించొద్దని, వారిపై ఆయుధాలు ప్రయోగించవద్దని కోరారు. స్థానిక పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, బలవంతంగా ఏది చేసినా.. అది ఇరు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ‘ఉగ్రవాదానికి నిధులు సమకూర్చుతున్న దేశాల జాబితా’ నుంచి సూడాన్‌ను అమెరికా గతేడాది తొలగించింది. తాజాగా.. మరోసారి ఈ తరహా ఆంక్షలు విధించేందుకు వెనుకాడబోమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని