Published : 12 Nov 2021 15:22 IST

Myanmar: అమెరికాకు ఎదురుదెబ్బ! ఆ దేశ జర్నలిస్టుకు మయన్మార్‌లో జైలుశిక్ష

యాంగూన్‌: మయన్మార్‌లో సైన్యం నిర్బంధించిన జర్నలిస్టులను విడిపించేందుకు యత్నిస్తున్న అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి జుంటా కోర్టు శుక్రవారం అమెరికన్ జర్నలిస్ట్‌ డానీ ఫెన్‌స్టర్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం, సైన్యంపై ప్రజలను రెచ్చగొట్టే ప్రవర్తన, వీసా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై అతనికి ఈ శిక్ష పడింది. అమెరికా మాజీ దౌత్యవేత్త, బందీలుగా ఉన్నవారి తరఫున మాట్లాడేందుకు నియమించిన బిల్ రిచర్డ్‌సన్ ఇటీవల జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌ను కలిసిన కొద్ది రోజులకే ఈ తీర్పు వెలువడటం గమనార్హం. ‘ఫ్రంటియర్‌ మయన్మార్‌’లో మేనేజింగ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఫెన్‌స్టర్.. ఏడాదిగా ఇక్కడే పనిచేస్తున్నారు. మేలో తన కుటుంబాన్ని చూసేందుకు అమెరికాకు వెళ్తుండగా సైన్యం అతన్ని నిర్బంధించింది. అతనిపై దేశద్రోహం, తీవ్రవాద ఆరోపణలూ మోపింది. దీంతో జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయి.

‘తీవ్ర నిరాశకు లోనయ్యాం’

ఫెన్‌స్టర్‌కు జైలు శిక్ష పడటంపై తీవ్ర నిరాశకు లోనయినట్లు పత్రికా యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. వీలైనంత త్వరగా అతను విడుదలవుతాడని ఆశిస్తున్నట్లు పేర్కొంది. క్రైసిస్‌ గ్రూప్‌ మయన్మార్‌ సీనియర్‌ సలహాదారు రిచర్డ్‌ హార్సీ మాట్లాడుతూ.. ఈ తీర్పును ‘దౌర్జన్యం’గా అభివర్ణించారు. దీంతో వాస్తవాలు మాట్లాడితే శిక్ష పడుతుందని అంతర్జాతీయ జర్నలిస్టులకే కాదు.. స్థానిక జర్నలిస్టులకూ సందేశం వెళ్తోందని చెప్పారు. మరోవైపు అతన్ని విడిపించేందుకు అమెరికా దౌత్యవేత్తలు కృషి చేస్తున్నారని తెలిపారు. కానీ.. ప్రస్తుత తీర్పు అమెరికా ప్రయత్నాలకు విఘాతం అని అన్నారు. ఫిబ్రవరిలో ఆంగ్‌సాన్‌ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి, అధికారాన్ని చేజిక్కించుకున్న సైన్యం.. అప్పటినుంచి ప్రజాస్వామ్యవాదులతోపాటు మీడియాను అణచివేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో జర్నలిస్టులను నిర్బంధించింది. 31 మంది ఇంకా నిర్బంధంలోనే ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు స్థానికంగా నిరసనల్లో పాల్గొన్న దాదాపు 1,200 మందిని హతమార్చినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని