Donald Trump: ‘ఆ ఆయుధాలను ధ్వంసం చేయలేదు.. ఇప్పుడు చైనా, రష్యాలకు ప్రయోజనం’

అఫ్గాన్‌నుంచి బలగాల ఉపసంహరణ క్రమంలో అమెరికా పెద్దఎత్తున అధునాత ఆయుధ సామగ్రిని అక్కడే విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వాటిని పనికిరాకుండా చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. కానీ.. సైన్యం వాటిని ధ్వంసం చేయకుండానే తిరిగొచ్చిందని...

Published : 11 Oct 2021 02:07 IST

వాషింగ్టన్‌: అఫ్గాన్‌నుంచి బలగాల ఉపసంహరణ క్రమంలో అమెరికా పెద్దఎత్తున అధునాత ఆయుధ సామగ్రిని అక్కడే విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వాటిని పనికిరాకుండా చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. కానీ.. సైన్యం వాటిని ధ్వంసం చేయకుండానే తిరిగొచ్చిందని దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరోసారి విమర్శలకు దిగారు. ఆ ఆయుధ సంపదతో ప్రస్తుతం రష్యా, చైనా సహా ఇతర శక్తులకు ప్రయోజనం చేకూరుతోందని ఆరోపించారు. బ్లాక్ మార్కెట్‌లోనూ వాటి విక్రయాలు సాగుతున్నాయన్నారు. డెస్ మొయిన్స్‌లో నిర్వహించిన ‘సేవ్‌ అమెరికా ర్యాలీ’లో భాగంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటికే రష్యా, చైనా వద్ద అమెరికాకు చెందిన అధునాతన హెలికాప్టర్ల నమూనాలు ఉన్నాయి. ప్రస్తుతం అపాచీ హెలికాప్టర్లను వారు రీ ఇంజినీరింగ్‌ చేస్తున్నారు. వాటి విడిభాగాలను అధ్యయనం చేస్తున్నారు. అతి త్వరలోనే వారు తక్కువ డబ్బుతోనే అత్యుత్తమమైన హెలికాప్టర్లను నిర్మిస్తారు’ అని పేర్కొన్నారు.

మూడు శాతం మందే అర్హులు..

ఇటీవల అఫ్గాన్‌నుంచి అమెరికాకు తరలించినవారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే ఇక్కడికి వచ్చేందుకు అర్హులని ట్రంప్ పేర్కొన్నారు. అసలు ఆ తరలింపు విమానాల్లో ఎవరెక్కుతున్నారో కూడ బలగాలకు తెలియలేదని అన్నారు. అఫ్గాన్‌నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తీరుపై మొదటినుంచి జో బైడెన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ట్రంప్‌.. ఈ ప్రక్రియ చాలా అసమర్థంగా జరిగిందని పలుమార్లు ఆరోపించారు. ఇలాంటి దారుణమైన ఉపసంహరణ ప్రక్రియను చరిత్రలో ఏ యుద్ధంలోనూ చూడలేదంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని