Varun Gandhi: రైతులకు మద్దతుగా ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ను ప్రవేశపెట్టిన భాజపా ఎంపీ

పంట ఉత్పత్తులకు రైతు కనీస ధరను పొందేలా వరుణ్‌ గాంధీ పార్లమెంట్‌లో శుక్రవారం ఓ బిల్లును ప్రవేశపెట్టారు.......

Updated : 10 Aug 2022 16:41 IST

దిల్లీ: కేంద్రంలో భాజపా సర్కార్‌ తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను అదే పార్టీకి చెందిన ఎంపీ వరుణ్‌ గాంధీ పలుమార్లు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ చట్టాలు రైతులకు అన్యాయం చేసేలా ఉన్నాయంటూ తనదైన శైలిలో సొంత పార్టీపై విమర్శలు చేశారు. కాగా ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం గత నవంబర్‌లో ప్రకటించింది. ఇదిలా ఉంటే.. పంట ఉత్పత్తులకు రైతులు కనీస ధరను పొందేలా వరుణ్‌ గాంధీ లోక్‌సభలో శుక్రవారం ఓ ప్రైవేటు  బిల్లును ప్రవేశపెట్టారు. రైతు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను చట్టబద్ధమైన హక్కుగా కల్పించాలంటూ ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ను పెట్టారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్ సైతం ఈ తరహాలోనే ‘ఉపా చట్టం’ రద్దు చేసే బిల్లును ప్రవేశపెట్టారు.

గతంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. దాదాపు ఏడాది పాటు రైతులు పోరుబాట పట్టారు. మూడు చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీలో వేలాది మంది రైతులు నిరసన చేపట్టారు. దీంతో దిగొచ్చిన కేంద్రం.. ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని