Farmers Protest: ఎందుకీ ‘దిల్లీ చలో’.. రైతన్నల ప్రధాన డిమాండ్లు ఏంటి?

Farmers Protest: రైతన్నలు దిల్లీ చలోకు ఎందుకు పిలుపునిచ్చారు?.. వారి ప్రధాన డిమాండ్లు ఏంటి?

Updated : 13 Feb 2024 17:37 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు ‘దిల్లీ చలో’ (Farmers Protest) పేరుతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. అయితే, వారి ప్రయత్నాలను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. సోమవారం రాత్రి రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం పంజాబ్‌, హరియాణా నుంచి పెద్దసంఖ్యలో బయల్దేరారు.   ఆరు నెలలకు సరిపడా ఆహారం, ఇతర సామగ్రితో వారు దేశ రాజధానికి వస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం ఉద్యమించిన రైతన్నలు మరోసారి ఎందుకు ఆందోళనకు సిద్ధమయ్యారు? వారి ప్రధాన డిమాండ్‌లు ఏంటి?

‘6 నెలలకు సరిపడా ఆహారం, డీజిల్‌’: సుదీర్ఘ నిరసనకు సిద్ధమైన కర్షకులు

  • రైతుల డిమాండ్లలో ప్రధానమైనది.. పంటకు కనీస మద్దతు ధర (MSP). మార్కెట్‌ ఒడుదొడుకులతో సంబంధం లేకుండా..  ఎమ్‌ఎస్‌పీ భరోసా కల్పిస్తూ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో దీనిపై ఏకాభిప్రాయం కుదరలేదు. 
  • ఎమ్‌ఎస్‌పీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, పంట రుణాల మాఫీకి సంబంధించి చట్టపరమైన హామీలు ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటుచేస్తామని కేంద్రం తెలిపింది. ఈ ప్రతిపాదనకు రైతు సంఘాల నాయకులు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 
  • 2020-21లో ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. నిన్న జరిగిన చర్చల్లో దీనికి కేంద్రం అంగీకరించింది. అలాగే, అప్పటి ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం అందించాలని కోరారు. దీనికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ, వీటిపై కేంద్రం రెండేళ్లక్రితమే హామీ ఇచ్చినా.. ఇప్పటికీ నెరవేర్చలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
  • వివాదాస్పద విద్యుత్‌ చట్టం 2020ని రద్దు చేయడం. దీనివల్ల కేంద్రం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తే.. తమకు అందే రాయితీని కోల్పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
  • వీటితోపాటు భూసేకరణ చట్టం 2013ని పునఃవ్యవస్థీకరించడం, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ నుంచి వైదొలగడం వంటి డిమాండ్లను కేంద్రం ముందుంచారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని