‘అరుపులు ఆపేంతవరకు మా అక్కను పోలీసులు కొట్టారు..’

ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌలీ ప్రాంతంలో ఓ ఇసుక వ్యాపారి ఇంటికి సోదాలకు వెళ్లిన పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా వ్యాపారి

Published : 03 May 2022 01:42 IST

సోదాల పేరుతో పోలీసుల అమానుషం.. యువతి మృతి

చందౌలి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌలీ ప్రాంతంలో ఓ ఇసుక వ్యాపారి ఇంటికి సోదాలకు వెళ్లిన పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆడపిల్లలు అని కూడా చూడకుండా వ్యాపారి కుటుంబసభ్యులను దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసులే తన అక్కను కొట్టి చంపారని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి చెల్లి వాపోయింది. ఆమెపై అత్యాచారం కూడా జరిగి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. అసలేం జరిగిందంటే..

చందౌలీలోని మన్‌రాగ్‌పూర్‌ గ్రామంలో ఓ ఇసుక వ్యాపారి ఇంటికి స్థానిక పోలీసులు ఆదివారం తనిఖీలకు వెళ్లారు. ఇంట్లో వ్యాపారి కన్పించకపోవడంతో కుటుంబసభ్యులను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యాపారి 24 ఏళ్ల కుమార్తె అక్కడికక్కడే మరణించింది.  విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. పోలీసు బృందంపై దాడి చేయగా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారానికి దారితీసింది.

అయితే తన అక్కను పోలీసులే చంపేశారని మృతురాలి సోదరి మీడియాకు తెలిపారు. ‘‘నిన్న మా ఇంటికి పోలీసులు వచ్చారు. ఎలాంటి వారెంట్‌ చూపించకుండానే మమ్మల్ని చితకబాదారు. మేం వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాం. మా అక్క గదిలోకి వెళ్లి తలుపు వేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు ఆమెను పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. కాసేపటికి తర్వాత సాయం కోసం మా అక్క పెట్టిన కేకలు ఆగిపోయాయి. కొంత సేపటి తర్వాత నేను గదిలోకి వెళ్లగా మా అక్క ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించింది. పోలీసులే ఆమెను చంపి.. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారు’’ అని మృతురాలి సోదరి ఆరోపించారు. పోలీసులు ఆమెపై అత్యాచారం చేసి చంపేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై చందౌలీ ఎస్పీ స్పందిస్తూ.. ఆరుగురు పోలీసులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. యువతి మృతికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని, పోస్ట్‌మార్టం నివేదికను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అత్యాచార ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనపై ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని