Software Update: గూగుల్‌ ఏడేళ్లు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇస్తుందా..?

స్మార్ట్ గ్యాడ్జెట్‌ తయారీ కంపెనీలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఏడేళ్ల పాటు అందివ్వాలనే నిబంధనను జర్మనీ ప్రభుత్వం అమల్లోకి తేనుంది. దీంతో భారత్‌లో కూడా ఎంతో కాలంగా ఉన్న ఈ డిమాండ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Updated : 12 Sep 2021 21:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాఫ్ట్‌వేర్ అప్‌డేట్.. స్మార్ట్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసిన తర్వాత ప్రతి యూజర్‌ దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఉపయోగించే ఓఎస్‌లో ఉన్న లోపాలను సరిచేసి.. కొత్త ఫీచర్లతో ప్రతి ఏడాది ఓఎస్‌ అప్‌డేట్‌లను అందిస్తుంటాయి టెక్ సంస్థలు. అయితే చాలావరకు గ్యాడ్జెట్స్‌ తయారీ సంస్థలు ఈ ఓఎస్‌ అప్‌డేట్‌లను కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే పరిమితం చేస్తుంటాయి. దాంతో పాత డివైజ్‌లలో ఓఎస్‌ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న యూజర్స్‌కి నిరాశ మిగులుతుంది. 

అందుకే యాపిల్‌ తన యూజర్స్‌కి ఏడు సంవత్సరాలపాటు ఈ ఓఎస్‌ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఉదాహరణకు మీరు గతేడాది ఐఫోన్ 12 ఫోన్ కొన్నారు. అందులో ఐఓఎస్‌ 14 ఓఎస్‌ను ఇచ్చారు. త్వరలో రానున్న ఐఓఎస్‌ 15 నుంచి మరో ఐదు సంవత్సరాలపాటు వచ్చే కొత్త ఐఓఎస్‌ అప్‌డేట్‌లు ఐఫోన్ 12 యూజర్ పొందుతారు. అయితే యాపిల్‌తో పోలిస్తే గూగుల్‌ అందించే ఆండ్రాయిడ్ ఓఎస్‌ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆండ్రాయిడ్ తన ఓఎస్‌ అప్‌డేట్‌లను కేవలం రెండు లేదా మూడు సంవత్సరాలపాటు మాత్రమే అందిస్తుంది. అంటే ఫోన్ కొని మూడేళ్లయిన తర్వాత వచ్చే ఓఎస్‌ అప్‌డేట్‌లు కావాలంటే మాత్రం కొత్త ఫోన్ కొనాల్సిందే. దీంతో యూజర్స్‌పై భారం పడుతోంది. దీనిపై యూజర్స్‌ నుంచి ఫిర్యాదులు పెరిగిపోవడంతో జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

ప్రతి మొబైల్ తయారీ కంపెనీ కచ్చితంగా ఏడు సంవత్సరాల పాటు తమ ఓఎస్‌ అప్‌డేట్‌లను అందించే విధంగా కొత్త నియమావళిని అమల్లోకి తేనుందట. ప్రస్తుతం దీనికి సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తుందని జర్మనీ ఫెడరల్‌ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమిక్స్ ఒక ప్రకటలో తెలిపింది. ఇలా చేయడం వల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు చాలా వరకు తగ్గించడంతోపాటు.. వినియోగదారులపై భారం తగ్గుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. అయితే భారత్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు సంబంధించి ఎలాంటి ప్రమాణాలు లేవు. కానీ ఎంతో కాలంగా యాపిల్ తరహాలో గూగుల్ కూడా తన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను ఏడేళ్లపాటు ఇవ్వాలని వినియోగదారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ నిర్ణయంపై టెక్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

అలానే గ్యాడ్జెట్ విడిభాగాలను కూడా ఐదురోజుల్లో యూజర్‌కి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జర్మనీ ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల యూజర్‌కి మెరుగైన సేవలు అందించడంతోపాటు, తమ డివైజ్‌లను వేగంగా మరమ్మత్తు చేయించుకోగలరని భావిస్తోంది. విడిభాగాలు అందుబాటులో లేని కారణంగా చాలా మంది యూజర్స్ తమ పాత గ్యాడ్జెట్స్‌కి బదులు కొత్త గ్యాడ్జెట్స్‌ని కొనుగోలు చేస్తున్నారని.. దాంతో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని తెలిపింది. భారత్‌లో కూడా ఈ నిబంధనలు అమలైతే చాలా వరకు ఎలక్ట్రానికి వ్యర్థాల సంఖ్య తగ్గిపోతుందని టెక్ వర్గాలు భావిస్తున్నారు.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని