
IND vs SA : రాహులూ..! ఇలా జరగాలంటే అదృష్టం ఉండాలయ్యా..
ఇంటర్నెట్ డెస్క్: ఒక్కోసారి క్రికెట్లో చోటు చేసుకునే సంఘటనలు తమాషాగా ఉంటాయి. మైదానంలోని వారికి ముచ్చెమటలు పట్టించినా.. ప్రేక్షకులకు మాత్రం నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇలాంటిదే భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డేలో జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు శుభారంభమే దక్కింది. తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్ (55), శిఖర్ ధావన్ (29) అర్ధశతక భాగస్వామ్యం నిర్మించారు. అయితే ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రిషభ్ పంత్ (85), రాహుల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించారు.
అయితే రిషభ్, కేఎల్ రాహుల్ కుదురుకునేదుకు కాస్త సమయం తీసుకున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ వేసిన 15వ ఓవర్లో రనౌట్ నుంచి కేఎల్ రాహుల్ తప్పించుకున్నాడు. మహరాజ్ బంతిని మిడ్‌వికెట్ మీదుగా పంత్ ఆడాడు. వెంటనే పరుగు కోసం అవతలి ఎండ్‌లో ఉన్న రాహుల్‌ను పిలిచి వద్దని వారించాడు. అప్పటికే కేఎల్ రాహుల్ స్ట్రైకింగ్ ఎండ్ వద్దకు వెళ్లిపోయాడు. అయితే అక్కడ కాచుకుని ఉన్న టెంబా బవుమా వేగంగా కేశవ్ మహరాజ్‌కు బంతిని విసిరాడు. అయితే బంతి మిస్ అయి డీప్ వికెట్ వద్దకు వెళ్లిపోయింది. దీంతో వెంటనే రాహుల్ వెనక్కి పరుగెత్తి వచ్చేయడంతో బతికిపోయాడు. అప్పటికి కేఎల్ రాహుల్ స్కోరు 27 పరుగులు మాత్రమే. అయితే అర్ధ శతకం సాధించిన తర్వాత కేఎల్ రాహుల్ ఔటై పోగా.. సెంచరీ చేస్తాడని భావించిన పంత్ కూడా వెంటనే పెవిలియన్‌కు చేరిపోయాడు. కేఎల్ రాహుల్ రనౌట్ మిస్ అయిన వీడియోను ఓ అభిమాని షేర్ చేశాడు.