విజయశాంతి ఇచ్చిన సలహా అది!
సినీ అభిమాన హృదయాల్లో తమ సహజ నటనతో వారు సంపాదించుకున్న స్థానం సుస్థిరం. తల్లి పాత్రలతో ‘అమ్మగా’ గుర్తుండిపోయింది ఒకరైతే.. గయ్యాలి పాత్రలతో ‘వామ్మో’ అనిపించుకుంది మరొకరు. యాభయేళ్ల తమ సినీ ప్రస్థానంలో ఎన్నో గొప్ప పాత్రల్లో అత్యద్భుతమైన నటనతో
‘ఆలీతో సరదాగా’లో సీనియర్ నటులు అన్నపూర్ణ, వై.విజయ
ఇంటర్నెట్ డెస్క్: సినీ అభిమాన హృదయాల్లో తమ సహజ నటనతో వారు సంపాదించుకున్న స్థానం సుస్థిరం. తల్లి పాత్రలతో ‘అమ్మగా’ గుర్తుండిపోయింది ఒకరైతే.. గయ్యాళి పాత్రలతో ‘వామ్మో’ అనిపించుకుంది మరొకరు. యాభయేళ్ల తమ సినీ ప్రస్థానంలో ఎన్నో గొప్ప పాత్రల్లో అత్యద్భుతమైన నటనతో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్న నటీమణులు అన్నపూర్ణమ్మ, వై.విజయ. వాళ్లిద్దరూ ఆలీ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’లో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వాళ్ల అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అవేంటో మీకోసం..
మీ పేరు ఉమ కదా..! మరి అన్నపూర్ణగా ఎలా మారింది..?
అన్నపూర్ణ: మాది విజయవాడ. నేను ఒకట్రెండు సినిమాలు చేసేవరకూ నాపేరు ఉమా అనే వేశారు. దాసరి నారాయాణరావుగారి సినిమా సమయంలో రచయిత సి.నారాయణరెడ్డి నా పేరును అన్నపూర్ణగా మార్చారు. ఆ పేరు నాకు చాలా బాగా నచ్చింది. ఒక 700-800 సినిమాల్లో ఆ పేరుతోనే చేశాను.
ఇండస్ట్రీలో బాగా నచ్చిన హీరో ఎవరు.?
అన్నపూర్ణ: నాకు అప్పటికీ.. ఇప్పటికీ ఎప్పటికైనా ఎన్టీఆర్.. (వెంటనే ఆలీ స్పందిస్తూ.. సూపర్ మనిద్దరం ఒకటే అని చెప్పగా.. నేను కూడా అని విజయ తనకు ఎన్టీఆర్ అంటే ఇష్టమని అన్నారు)
మూడేళ్ల వయసులోనే రేడియో పాట విని డ్యాన్స్ వేసేవారంట..?
వై.విజయ: చిన్నతనంలో రేడియోలో పాట వస్తే.. డ్యాన్స్ చేస్తూచేస్తూ అలాగే అలసిపోయి పడిపోయేదాన్ని. స్కూల్‌లో కూడా బాగా డ్యాన్స్ చేసేదాన్ని. ఆ తర్వాత కాలేజీ ఫంక్షన్లలో చేస్తుండేదాన్ని. పాపకు డ్యాన్స్ అంటే బాగా ఆసక్తి ఉందని తెలుసుకొని అప్పుడు మా అమ్మానాన్న నన్ను మద్రాసు తీసుకొచ్చి వెంపటి చిన్నసత్యం మాస్టార్ దగ్గర చేర్పించారు. ఈ విషయంలో మా అమ్మానాన్న చాలా గ్రేట్. రేఖ, హేమమాలిని కూడా అక్కడే డ్యాన్స్ నేర్చుకునే వాళ్లు.
హీరోయిన్‌గా మొదటి సినిమా..?
వై.విజయ: మేం పదిమంది సంతానం. ఆరుమంది ఆడపిల్లలం, నలుగురు మగవాళ్లు. అప్పుడు నాకు 13 సంవత్సరాలు. శోభన్‌బాబుగారి సినిమా ‘తల్లిదండ్రి’లో నటించా. ఆ సినిమాలో సావిత్రి, జగ్గయ్యగారు కూడా ఉన్నారు. శోభన్‌బాబు గారి మేనకోడలు పాత్ర నాది. ఆయనతో మూడు పాటలు ఉన్నాయి. ఇదెలా జరిగిందంటే.. మా నాన్నగారేమో నన్ను చదివించాలని.. మా అమ్మేమో నాకు డ్యాన్స్ నేర్పించాలని. నాకోసం ప్రత్యేకంగా ఇల్లు తీసుకున్నారు. కేవలం డ్యాన్స్ కోసం ఇలా ఏ తల్లిదండ్రులు చేసి ఉండరు. డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఎస్వీఎస్ ప్రొడక్షన్స్‌లో సినిమా జరుగుతోంది. అందులో ఒక పాటకోసం పేద అమ్మాయిలా చేశాను. అప్పుడు డ్యాన్సర్ల కోసం సినిమావాళ్లు పాఠశాలలకు వచ్చేవాళ్లు.
మీరెప్పుడు కెమెరా ముందుకు వచ్చారు..?
అన్నపూర్ణ: కెమెరా ముందుకు ఎప్పుడు వచ్చానో గుర్తులేదు. కానీ, అంతకుముందు నాటకాలు వేసేవాళ్లం. 1967లో పడమూడేళ్ల సమయంలో నాటకాలతో మొదలైంది నా జీవితం. ‘నీడలేని ఆడది’ సినిమాలో మద్రాసు నుంచి రావాల్సిన అమ్మాయి రైళ్లు లేకపోవడంతో రాలేకపోయింది. దీంతో బెజవాడ నుంచి నన్ను వైజాగ్‌కు పిలిచారు. నాతో పాటు నూతన ప్రసాద్‌కు అదే మొదటి సినిమా. సినిమా నీడలేని ఆడది.. కానీ నాకు మాత్రం బాగానే నీడ దొరికింది.
మీ మొదటి సినిమా..?
అన్నపూర్ణ: ‘అమ్మాయిలు జాగ్రత్త’. అందులో ముగ్గురు హీరోయిన్లు. నరసింహరాజు హీరో. ఆ సినిమాలో ఒక ముసలాయనతో నాకు పెళ్లి చేస్తారు. హీరోతో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని అనుకునే పాత్ర నాది.
వై.విజయ: రామారావుగారి కూతురు పురంధేశ్వరి, నేనూ డ్యాన్స్ స్కూల్ స్నేహితులం. అందువల్ల నేరుగా వాళ్లింటికి వెళ్లిపోయేదాన్ని. అప్పటికే హీరోయిన్‌గా పదిహేను సినిమాలు చేశాను. రామారావుగారితో ‘శ్రీకృష్ణసత్య’ చేశాను. ఆ సినిమా సమయంలో నన్ను చూసి ‘మీరు నా పక్కన ఆనరు. కొంచెం లావుకావాలి’ అని రామారావుగారు అన్నారు. ఆ సినిమా రిహార్సల్స్ సమయంలో పద్నాలుగుసార్లు ఎత్తుకున్నారు. రామారావు, ఎంజీఆర్, రజనీకాంత్, కమల్ హాసన్, శివాజీ గారితో సినిమాలు చేశాను. వాళ్ల దగ్గర మర్యాద.. భయం.. టైమింగ్ అన్నీ నేర్చుకున్నాం.
మీ పెళ్లెప్పుడు జరిగింది..?
అన్నపూర్ణ: అదో విచిత్ర పరిస్థితి(నవ్వుతూ). ఇరవయేళ్లలోపే చేసేసుకున్నా. ఎవడుపడితే వాడు లవ్ చేస్తానంటాడు. అందుకే పెళ్లి చేసుకున్నా. చాలామంది ప్రపోజ్ చేశారు. ‘ఏమంటావ్.. ఏమంటావ్’ అనేవాళ్లు. ‘ఇప్పుడప్పుడే నేనేం అనుకోవట్లేదు’ అని చెప్పేదాన్ని. మా ఆయన ఓ ఉద్యోగి. కాస్త మెతక వ్యక్తి. ఆయనది బందరు. సినిమాల్లోకి వచ్చేటప్పటికి పెళ్లయిపోయింది. నాకన్నీ మా అమ్మే. ఇండస్ట్రీ.. మా అమ్మ.. రెండూ నా ప్రాణాలు. ఈ రెండే నా జీవితాన్ని మార్చేశాయి.
అమ్మలాంటి సినిమాకు అమ్మగా అన్నపూర్ణమ్మ మారారు ఎలా అనిపిస్తుంది
అన్నపూర్ణ: ఆ భగవంతుడు ఎంత అదృష్టాన్నిచ్చాడో చెప్పలేను. కానీ.. నేను కోరుకున్నదే ఈ వేషం. ఈ పాత్ర చేయాలని నన్నెవరూ బలవంతపెట్టలేదు. రెండే సినిమాలు హీరోయిన్‌గా చేసి మానేశాను. ఎవరైనా సినిమావాళ్లు వస్తే.. అమ్మగాని.. అక్కగాని.. వదినగాని ఉంటే వేస్తాను అని చెప్పేదాన్ని. అప్పట్లో రూ.2వేలు.. మూడు వేలు.. ఇచ్చేవాళ్లు.
ఒక రోజుకు ఎన్ని సినిమాలు చేసేవాళ్లు..?
వై.విజయ: ఒకరోజుకు మూడు నాలుగు సినిమాలు.. రెండు డబ్బింగ్‌లు. ఒక రోజు ఐదారు సినిమాలు నాకే వేసేవారు. షూటింగ్, డబ్బింగ్ అయిపోయిన తర్వాత ట్రైన్‌లో తిరుపతి వెళ్లేదాన్ని.
అప్పట్లోనే వెరైటీ హెయిర్‌స్టైల్ వేసేవారట.
అన్నపూర్ణ: నాకు జుట్టు తక్కువగా ఉండేది. నిజానికి బుద్ధిమంతులకు జుట్టు ఎక్కువ ఉండదు(నవ్వుతూ). ‘అమ్మాయిలూ జాగ్రత్త’ కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కావాలని పి.సాంబశివరావు బెజవాడకు వచ్చారు. అప్పుడు నన్ను చూసి.. ‘బాగానే ఉన్నావు కానీ.. జుట్టు చూస్తే టైఫాయిడ్ రోగిలా ఉన్నావ్’ అన్నారు. అప్పటి దాకా నాకా విషయం తెలియదు. ఏమోనండీ మరి ఇదే ఉంది అన్నాను. అలా అనకూడదని కూడా అప్పట్లో నాకు తెలియదు.
అమ్మ వేషాలు వేసిన అన్నపూర్ణమ్మకి ఇటీవల...
అన్నపూర్ణ: కోడంబాకంలో విలాసినిరెడ్డి అని ఒక డాక్టర్ ఉండేవారు. మన సినిమావాళ్లందరూ ఆవిడ దగ్గరే పురుడు పోయించుకున్నారు. కేవలం ఐదు రూపాయలే తీసుకునేది. ఆమె దగ్గరికి వచ్చినవాళ్లు మొత్తం రూ.300ఖర్చుతో పురుడు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్లిపోయేవారు. ఆమెను చూసిన తర్వాత.. ఒక ఆడపిల్లను పెంచుకొని ఆమెలా తయారు చేయాలని అనుకున్నాను. మా బెజవాడలో ఆసుపత్రి పెట్టి ఐదు రూపాయలకే వైద్యం అందించాలని అనుకున్నాను. అందుకే ఒక ఆడపిల్లను పెంచుకున్నాను. కానీ.. ఆమెకు చదువు ఎక్కలేదు. ‘నాకు చదువురావట్లేదు ఏం చేయాలి’ అనేది. చాలా అందంగా ఉండేది. 18ఏళ్లు వచ్చాక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాం. ఆమెకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు మాటలు రాలేదు. మూగ కూతురు పుట్టిందని దిగులు పెట్టుకుందో ఏమో.. ఆత్మహత్య చేసుకుంది. ఆ పాపకు ఇప్పుడు మాటలు వస్తున్నాయ్. హీరోయిన్ ‘టబు’లా ఉంటది. బహుశా ఆమె సినిమాల్లోకి వస్తుందేమో.. నేను బతికుంటే కచ్చితంగా తీసుకొస్తా.
మీ వివాహం ఎలా జరిగింది?
వై.విజయ: నేను సినిమా వాళ్లను కాకుండా బయటవాళ్లను చేసుకోవాలని అనుకునేదాన్ని. అలా అని నాకు సినిమా రంగంలో ఎలాంటి చేదు అనుభవం లేదు. ఆయన కడపలో ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు.. మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు. ఆ సమయంలో పరిచయమయ్యారు. 4-5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందామని నేనే అడిగాను. ఆయన ఓకే అన్నారు. 1985 జనవరి 27న పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లికి ముందు రోజు కోడి రామకృష్ణగారి ‘సినిమా మా పల్లెలో గోపాలం’ సినిమా షూటింగ్‌లో 11 గంటలు పాల్గొన్నాను. రాత్రి 12గంటలకు షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత రోజు రిజిస్టర్ మ్యారెజ్ చేసుకున్నాం. నేను కోరుకున్నట్లుగానే ఆ భగవంతుడు ఒక మంచి భర్తను నాకు ఇచ్చాడు. మాకో అమ్మాయి.
విజయశాంతి.. మీరూ కలిసి ఏదో బిజినెస్ పెట్టారట..?
వై.విజయ: బిజినెస్ పెట్టలేదు. నాకు సలహా ఇచ్చిందామె. నన్ను అక్కా అని పిలిచేది. ‘ఈ సినిమాలను ఎంతకాలం నమ్ముకుంటాం. ఇంకా ఏదైనా చేసుకోవాలి’ అని చెప్పింది. ‘నేను కమర్షియల్ ప్లాట్ కొన్నాను. అద్దె కూడా వస్తుంది. భవిష్యత్‌లో బతకాలంటే కనీసం నెలకు రూ.లక్ష అయినా కావాలి’ అని చెప్పింది. ‘అంటే ఏం చేయాలి శాంతి’ అని అడిగా. ‘ఏదైనా కాంప్లెక్సు లేదా కళ్యాణ మండపం ఉంటే హ్యాపీగా ఉండొచ్చు. సినిమాల్లేకపోయినా బతకొచ్చు.. సినిమాలు ఎంతకాలం ఉంటాయి’ అని చెప్పింది. ఇదే విషయాన్ని మా ఆయనతో చెప్పాను. 1995లో విజయాతిరుమల మండపం కూడా ఏర్పాటు చేశాం.
మీరు ఉంటేనే సినిమా చేస్తాం అని చెప్పిన డైరెక్టర్ ఎవరు..?
వై.విజయ: రామ్‌గోపాల్ వర్మ. ‘అనగనగా ఒకరోజు సినిమా’కు ఓకే చెప్పాను. ఆ తర్వాత మా అక్క చనిపోవడంతో షూటింగ్‌కు వెళ్లలేదు. ఆ తర్వాత ఒకసారి విమానాశ్రయంలో వర్మ కలిశారు. ‘సారీ అండీ నేను మీ సినిమా చేయలేకపోయాను’ అని చెప్పగానే.. లేదమ్మా షెడ్యుల్ మార్చాము. ఈ సినిమాలో పాత్ర మీరే చేయాలని అన్నారు. అలా నాకోసం షెడ్యుల్ మార్చారు. ఆయన లాంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు. ఒకసారి బస్సులో రామానాయుడు గారిని చూశాను. అటువైపుగా వెళుతుంటే.. ఆయనే నన్ను ‘విజయా’ పిలిచారు. ఇంకోసారి స్నేహ పెళ్లిలో కూడా నాకోసం కాసేపు ఎదురుచూశారు. అంత పెద్ద నిర్మాత అలా సింపుల్‌గా ఉండటం గ్రేట్.
ఓలెక్స్ పీస్‌లు కదా..!(ఎఫ్2లో పాత్రలనుద్దేశిస్తూ)
అన్నపూర్ణ: ఓల్‌ఎక్స్ అని వాళ్లు అంటారే అనుకో.. నువ్వు కూడా అంటావా(నవ్వుతూ..). అనిల్ రావిపూడి ఎలా ఊహించుకుంటారో మనకు తెలియదు కానీ.. ఏదైనా ఒక క్యారెక్టర్ అనుకుంటే వాళ్లనే పెడతారు.
వై.విజయ: మా ఆయన అన్నట్లుగా అది క్యారెక్టర్ మాత్రమే. అంతెందుకు నన్ను అందరూ పులుసు.. పులుసు అంటారు. మా పని మనిషి కూడా వాళ్ల ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగితే ‘పులుసమ్మ’ ఇంట్లో ఉన్నా అంటుంది. ‘చంపేస్తా.. ఇంకోసారి పులుసమ్మ అంటే’ అని అరిచేదాన్ని.
ఈవీవీకి మోడ్రన్ లేడీగా ఎలా కనిపించారు
అన్నపూర్ణ: ఆయన లవర్ బాయ్. తెల్లజుట్టుపెట్టి ఎప్పుడూ ముసలిదానిలా చూపిస్తున్నారు. వెరైటీగా ఉంటే చూస్తారని రెండు సినిమాలు చేయించారు నాతో. హలో బ్రదర్, అప్పుల అప్పారావు. ఆయన నిజంగానే లవ్‌బాయ్.
కారు కొనుక్కుంటే రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తారని ఎవరో ఒక పెద్ద నటుడు చెప్పారట.. కారు కొన్నారా..?
అన్నపూర్ణ: రావుగోపాల్‌రావు గారు. అన్నమ్మ.. అన్నమ్మ అని పిలిచేవారు. ‘కారు ఉంటే మన రెమ్యునరేషన్ పెంచుతారు.. దర్జాగా ఉంటది.. మనకు విలువ ఇస్తారు’ అని చెప్పారు. ‘అవునా.. సర్’ అని అన్నారు. మా అమ్మతో చెబితే.. ‘రేపు వేషమిస్తారో లేదో మనకు తెలియదు. ఈరోజు వరకే గుర్తు పెట్టుకో.. వాళ్లంటే పెద్దవాళ్లు. ఎప్పటి నుంచో ఇక్కడే పాతుకుపోయి ఉన్నారు. వాళ్లు కారు కొనుక్కున్నా ఇంకేది కొన్నా చెల్లుబాటు అవుతుంది. ఆడదానికి కారు కొనుక్కొనే అవసరం పెట్టుకోకూడదు. చేద్దామనుకుంటే చెయ్. లేకుంటే వెళ్లిపోదాం’ అని మా అమ్మకు మొహమాటం లేకుండా చెప్పింది. ఇండస్ట్రీలోకి రాగానే కారు కొనుక్కుంటే అదో కష్టం.. ఇప్పుడు కొనకపోతే అదొక కష్టం. ఇప్పటికీ కారు లేదు. ఈ వయసులో ఎక్కడికి పోతాం.. పైగా కరోనా అందరి కళ్లు తెరిపించింది.
అన్నపూర్ణమ్మ రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతుందన్న కారణంతో ఏవైనా సినిమాలు వెళ్లిపోయాయా?
అన్నపూర్ణ: ఒకటో రెండో పోతాయ్. పోయేవాడు ముందే వద్దనుకునే మనదగ్గరికి వస్తాడు. మన వాళ్లు మంచివాళ్లే గానీ మా జనరేషన్ వాళ్లకు డబ్బు తక్కువే ఇద్దామని ఫిక్స్ అయిపోతారు. ఇంతకు ముందు డిమాండ్ చేసేది కాదు.. ఇప్పుడు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. మేమెంత కాలం ఉంటాం ఆలీ..! ఇప్పుడు కూడా డిమాండ్ చేసి అడక్కపోతే ఎలా..? దగ్గరదగ్గర యాభయేళ్లు అనుభవం ఉంది మాకు.
ఆలీ: భర్తగా మీతో ఎక్కువ సినిమాలు చేసిందెవరు..?
అన్నపూర్ణ: ఐదారుగురు నాతో భర్తలుగా పాత్రలు వేసేవాళ్లు.(నవ్వులు).
వై.విజయ: నేను చెప్తా.. సత్యనారాయణ గారు, రావుగోపాల్‌రావుగారు, మారుతీరావుగారు, జగ్గయ్యగారు, ప్రభాకర్‌రెడ్డిగారు.
అన్నపూర్ణ: రావు గోపాల్ రావుగారు తన సొంత భార్యలా ఫీలయ్యేవారు. ఇంకెవరికీ భార్యగా చేయకూడదని ఆయన ఉద్దేశం(నవ్వులు)
మీకు నచ్చిన సినిమా..?
అన్నపూర్ణ: కోడి రామకృష్ణగారితో చేసిన ఇంటి దొంగ. సినిమా చూసి అప్పుడు నన్నొకాయన ప్రేమించారు. నేనెక్కడో రాజమండ్రిలో ఉంటే అక్కడికి కూడా వచ్చారు. ఏ వయసుకు ప్రేమికులుంటారో అప్పుడు తెలిసింది నాకు. అలాగే కూర్చొని ఉన్నారు. ఎవరో మనకేం తెలుసు. ‘నేను వెళ్లిపోతున్నా.. ఆమెని కొంచెం పిలవండి’ అన్నారు. నా దగ్గరికి వచ్చి.. నా కొడుకు మాకు అన్యాయం చేశాడు. దాంతో నా భార్య చచ్చిపోయింది. ఏమైనా అలాంటి ఊహ ఉంటే కబురుపెట్టండని అన్నారు. ‘లేదండి.. వేషాలు అలా ఉంటాయి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు మీ ఊరెళ్లిపోండి’ అన్నాను.
ఇదీ చదవండి..
కనువిందు కరవైన సినిమా క్యాలెండర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
-
Politics News
EC: వయనాడ్ ఖర్చులు సమర్పించని ‘రాహుల్’పై ఈసీ వేటు!
-
India News
Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
Ts-top-news News
Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
-
Crime News
Andhra News: సీఎం జగన్‌పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు