ఉలగనాయగన్‌ గురించి తెలుసా..?

ఆయనొక విలక్షణ నటుడు, కథానాయకుడు, ప్రతినాయకుడు, రాజకీయనాయకుడు, కథకుడు, దర్శకుడు, గాయకుడు.. ఒక వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పడానికి బహుశా ఇంతకన్నా ఎక్కువ అర్హతలు అవసరంలేదేమో..! ఇవే కాదు.. డ్యాన్స్‌, పాటలు రాయడంతో పాటు..

Updated : 07 Nov 2020 12:31 IST

నేడు కమల్‌హాసన్‌ జన్మదినం..

పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

ఆయనొక విలక్షణ నటుడు, కథానాయకుడు, ప్రతినాయకుడు, రాజకీయనాయకుడు, కథకుడు, దర్శకుడు, గాయకుడు.. ఒక వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పడానికి బహుశా ఇంతకన్నా ఎక్కువ అర్హతలు అవసరంలేదేమో..! ఇవే కాదు.. డ్యాన్స్‌, పాటలు రాయడంతో పాటు పలు సినిమాలకు నిర్మాత. నటనతో ప్రయోగాలు చేసే శాస్త్రవేత్త ఆయన. యువనటులకు ప్రేరణ. భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన ఆయనే ‘ఉలగనాయగన్‌’(విశ్వనటుడు) కమల్‌హాసన్‌. 1954 నవంబర్‌ 7న తమిళనాడులోని పరమకుడిలో జన్మించిన కమల్‌హాసన్‌ నేటితో 66 సంవత్సరాలు పూర్తి చేసుకొని 67వ వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు.. మీకోసం..!

* కమల్‌హాసన్‌ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్‌.

* ఐదేళ్ల వయసులోనే 1959లో వచ్చిన ‘కలతూర్‌ కన్నమ్మ’తో బాలనటుడిగా సినిమా రంగంలోకి ప్రవేశించారు. అంతేకాదు తొలిచిత్రంలోనే ఆయన నటనకు రాష్ట్రపతి గోల్డ్‌మెడల్‌ వచ్చింది.

* 18ఏళ్ల వయసులోనే ఆయన సినిమా స్క్రిప్టు రాసుకున్నారు.

* రూ.కోటి రెమ్యూనరేషన్‌ తీసుకున్న తొలి భారతీయ నటుడాయన.

* తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాళీ, హిందీ భాషల్లో నటించిన ఏకైక నటుడు.

* కమల్‌హాసన్‌ నటించిన 8 చిత్రాలు ఉత్తమ విదేశీ సినిమాల విభాగంలో ‘ఆస్కార్‌’కు నామినేట్‌ అయ్యాయి.

* నాలుగు జాతీయ పురస్కారాలు, 19 ఫిల్మ్‌ఫేర్‌లు, 9 తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు.. సినిమారంగంలో ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్‌ పురస్కారాలతో ఆయనను సత్కరించింది.

* హిందీ చిత్రం ‘సాగర్‌’లో కమల్‌హాసన్‌ను ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు వరించాయి. ఇలా రెండు అవార్డులు తీసుకోవడం కమల్‌కే సాధ్యమైంది.

* హాలీవుడ్‌లో వచ్చిన యానిమేషన్‌ సీక్వెన్స్‌ ‘కిల్‌బిల్‌’ను తెరకెక్కించిన దర్శకులు క్వింటిన్‌ టరంటినో సైతం కమల్‌హాసన్‌ను స్ఫూర్తిగా తీసుకొని దాన్ని రూపొందించారట. ఈ విషయాన్ని క్వింటిన్‌ స్వయంగా ఓసారి ఇంటర్వ్యూలో చెప్పారు.

* భారతీయ సినిమాలో ఓ సంచనలనం సృష్టించిన ‘రోబో’లో కమల్‌హాసన్‌ నటించాల్సింది. కానీ.. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించారు.

* రజనీకాంత్‌తో కలిసి కమల్‌హాసన్‌ 19 చిత్రాల్లో నటించారు.

* కమల్‌హాసన్‌ ప్రధానపాత్ర పోషించిన మరుదనాయగం చిత్రాన్ని రెండో ఎలిజబెత్‌రాణి స్వయంగా లాంచ్‌ చేశారు.

* తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాళీ, ఇంగ్లిష్‌లో మాట్లాడగలరు.

* కమల్‌ హాసన్‌కు యాక్షన్‌ సన్నివేశాల్లో నటించడం అంటే చాలా ఇష్టం. దశావతారం సినిమా ఆడియో లాంచ్‌కు స్టార్‌హీరో జాకీచాన్‌ వచ్చినప్పుడు కమల్‌హాసన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. జాకీచాన్‌ను అనుకరించేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డట్లు ఆయన చెప్పారు.

* ఇళయరాజాకు పెద్ద అభిమాని.*

2002, ఏప్రిల్‌ 27న టొరంటో విమానాశ్రయంలో కమల్‌హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనను ఉగ్రవాదిగా భావించిన అధికారులు కమల్‌హాసన్‌ను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వదిలేశారు.

కమల్‌హాసన్‌ తన సినిమా కెరీర్‌లో మరుపురాని మైలురాయిగా నిలిచిన భారతీయుడు చిత్రానికి ఇప్పుడు సీక్వల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘భారతీయుడు2’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల ఆగిన చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు కమల్‌. వైవిధ్యమైన పాత్రలను మరిన్ని ఆయన పోషించాలని ఆశిస్తూ, పుట్టిన రోజు శుభాకాంక్షలు

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని