ట్విటర్‌లో మోత మోగించిన ఐదు సినిమాలు..

ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులకు ప్రచారం ఎంత ముఖ్యమో.. విడుదలకు ముందు సినిమాలకు ప్రమోషన్‌ అంతే ముఖ్యం. ప్రచారమైనా.. ప్రమోషనైనా సీటు కోసమే. ప్రచారం విజయవంతమైతే నాయకుడికి సీటులో కూర్చోబెడుతుంది.

Updated : 09 Dec 2020 15:25 IST

కారణాలేంటో తెలుసా..?

ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులకు ప్రచారం ఎంత ముఖ్యమో.. విడుదలకు ముందు సినిమాలకు ప్రమోషన్‌ అంతే ముఖ్యం. ప్రచారమైనా.. ప్రమోషనైనా సీటు కోసమే. ప్రచారం విజయవంతమైతే నాయకుడిని సీటులో కూర్చోబెడుతుంది. ప్రమోషన్‌ సక్సెస్‌ అయితే ప్రేక్షకుడిని సీటులో కూర్చునేలా చేస్తుంది. అయితే.. ప్రమోషన్‌ సక్సెస్‌ కావాలంటే అది ప్రేక్షకులను ఆకట్టుకునే అంశమయ్యుండాలి.. లేదా అంతర్యుద్ధం సృష్టించేలా ఉంది అనిపించేలా ఉండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకుల నోళ్లలో నానుతుంది. నిజానికి సినిమా సాధించే తొలివిజయం అదే. మరి అచ్చం అలాగే.. వివాదాలతో కొన్ని సినిమాలు సోషల్‌ మీడియాలో మార్మోగిపోయాయి. అలా.. ఈ ఏడాది ట్విటర్‌లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన టాప్‌5 బాలీవుడ్‌ సినిమాలేంటి..? అందుకు గల కారణాలేంటో తెలుసా..?

* దిల్‌ బెచారా.. సుశాంత్‌ మరణం

ఈ సంవత్సరం ట్విటర్‌లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన చిత్రం ‘దిల్‌ బెచారా’. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ చివరి సినిమా కావడంతో ఈ సినిమా గురించి చాలామంది ట్వీట్లు చేశారు. 2014లో రొమాంటిక్‌ డ్రామాగా వచ్చిన హాలీవుడ్‌ చిత్రం ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’కు రిమేక్‌గా ‘దిల్‌ బెచారా’ను తెరకెక్కించారు. ఇద్దరు కేన్సర్‌ బాధితుల మధ్య సాగే ప్రేమ కథ ఇది. ఈ సినిమా విడుదల కాకముందే.. సుశాంత్‌ జూన్ 14న ముంబైలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘ఆత్మహత్య తప్పు’ అని చెప్పిన హీరో సుశాంత్‌ నిజజీవితంలో ఆత్మహత్యకు పాల్పడటంతో సినిమాపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఈ సినిమాకు ముకేశ్‌ చబ్బా దర్శకత్వం వహించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. ఓటీటీలో జులై 24న ఈ చిత్రం విడుదలైంది.

* ఛపాక్‌.. జేఎన్‌యూ సందర్శన

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో అంతగా సఫలం కాకపోయినా.. విమర్శకుల నుంచి ప్రసంశలు అందుకున్న చిత్రం ‘ఛపాక్‌’. విడుదలకు ముందే ఈ చిత్రం కూడా ట్విటర్‌లో ఎక్కువగా కనిపించింది. అయితే.. అందులో వ్యతిరేక పోస్టులే ఎక్కువ. కారణం.. ఈ సినిమా హీరోయిన్‌ దీపికా పదుకొణె జనవరిలో జరిగిన జేఎన్‌యూ ఘటనలో జోక్యం చేసుకోవడం. ఆమె యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులకు మద్దతు తెలిపింది. అయితే.. ఇదంతా తన సినిమా ప్రమోషన్‌ కోసం దీపిక చేస్తున్న పబ్లిక్‌స్టంట్‌ అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు.. ‘బాయ్‌కాట్‌ఛపాక్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ చాలా రోజులు ట్రెండింగ్‌లో కొనసాగింది. అలా.. ఈ సినిమా ఎక్కువగా ట్విటర్‌లో ప్రస్తావనకు వచ్చింది. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితకథ ఆధారంగా ఈ సినిమాను మేఘా గుల్జర్‌ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 10న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

* తానాజీ.. నిజాన్ని దాచిపెట్టారని

ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తానాజీ మొఘల్‌ సామ్రాజ్యంపై చేసే మెరుపుదాడుల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’. ఈ సినిమాలో తానాజీ పాత్రలో అజయ్‌ దేవ్‌గణ్‌తో పాటు మరో పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. అయితే.. ఈ సినిమాలో తానాజీ వాస్తవ చరిత్రను దాచిపెట్టారని అఖిల భారతీయ క్షత్రి కోలి రాజ్‌పుత్ సంఘం సినిమా నిర్మాతలపై ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన నటుడు సైఫ్‌ అలీఖాన్‌.. సినిమా రాజకీయాలు చాలా ప్రమాదకరమైనవని పేర్కొన్నారు. ఇలా.. ఈ సినిమా కూడా సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ.. ట్రెండింగ్‌లో నిలిచింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా కూడా జనవరి 10నే విడుదలైంది.

* థప్పడ్‌.. స్త్రీ-పురుష వాదుల చర్చ

పురుష అహంకార ధోరణిపై చెంపపెట్టు ‘థప్పడ్‌’. అనుభవ్‌సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సొట్టబుగ్గల సుందరి తాప్సీ ప్రధానపాత్ర పోషించింది. ఈ చిత్రంలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది. అందరి ముందు భార్యపై భర్త చేయిచేసుకోవడం సరైందేనా అనే చిన్న లాజిక్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే.. ‘చెంప దెబ్బ కారణంగా విడాకులు తీసుకోవాలనుకోవడం ఏంటి..? భార్యభర్తలంటేనే సర్దుకుపోవడం చిన్నచిన్నవాటిని కూడా హింసగా చిత్రీకరిస్తే ఎలా..?’ అని కొంతమంది.. ‘లేదులేదు.. మగవాళ్లతో పాటు స్త్రీలకు కూడా గౌరవమర్యాదలు ఉంటాయి. అలాంటప్పుడు ఆడవాళ్లు ఎందుకు తలొగ్గి ఉండాలి’ అని మరికొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇలా.. ఈ సినిమా ట్విటర్‌లో కొంతకాలం పాటు చర్చకు దారితీసింది. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో తాప్సీకి జోడీగా పావిల్‌ గులాటి కనిపించారు.

* గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గాల్‌.. ఎయిర్‌ఫోర్సు ఫిర్యాదు

యుద్ధంలో పాల్గొన్న తొలి భారత మహిళా పైలట్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గుంజన్‌ సక్సేనా’. కరణ్‌శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో పైలట్‌గా కనిపించింది. ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే.. ఈ సినిమాలో ఓ ఎయిర్‌ఫోర్స్‌ అధికారి చెప్పే ‘ఇది ఆడవాళ్ల కోసం ఉద్దేశించిన ప్రదేశం కాదు’ డైలాగ్‌ వివాదానికి దారి తీసింది. సినిమాలో ఆ మహిళా పైలట్‌ పాత్రను ఉద్దేశిస్తూ.. ‘భారత వైమానిక దళంలో చాలా మంది మహిళా అధికారులు ఉన్నారు’ అని ఆయన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారి పేర్కొన్నారు. సినిమా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్, నెట్‌ఫ్లిక్స్‌కు లేఖ రాశారు. అంతేకాదు.. కొంతమంది సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్లు చేశారు. ఇలా ఈ సినిమా ట్విటర్‌లో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిన టాప్‌5 సినిమాల జాబితాలో చోటు సంపాదించింది. ఇలా.. పెద్ద ఎత్తున వివాదాలతో మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 12న విడుదలైంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇదీ చదవండి..

అమ్మ చీరలో తారలు.. వివాహంలో తళుకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని