Updated : 30/09/2021 17:17 IST

No Time To Die: నో టైమ్‌ టు డై Movie Review

చిత్రం: నో టైమ్‌ టు డై; నటీనటులు: డేనియల్‌ క్రెగ్‌, రామి మాలెక్‌, లీసైడెక్స్‌, లషాణా లించ్‌, బెన్‌ విస్‌షా, నవోమి హారిస్‌, జెఫ్రీ రైట్‌ తదితరులు; సంగీతం: హన్స్‌ జిమ్మర్‌; ఎడిటింగ్‌: ఇల్లాట్‌ గ్రాహమ్‌; సినిమాటోగ్రఫీ: లైనస్‌ సాండ్రన్‌; కథ, స్క్రీన్‌ప్లే: క్యారీ జోజి ఫుకునాగా, నీల్‌ పర్విస్‌, రాబర్ట్‌ వేడ్‌; దర్శకత్వం: క్యారీ జోజి ఫుకునాగా; విడుదల: 30-09-2021

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌ బాండ్‌(James bond) చిత్రాలకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉంటారు. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో 24 చిత్రాలు వచ్చాయంటే ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన 25వ చిత్రం ‘నో టైమ్‌ టు డై’(No Time To Die). డేనియల్‌ క్రెగ్‌(Daniel Craig) జేమ్స్‌ బాండ్‌గా చివరి చిత్రం. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడతూ వచ్చింది. గురువారం భారత్‌లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది(Movie review)? ఈసారి బాండ్‌ ఏ సమస్యను పరిష్కరించాడు? బాండ్‌గా తన చివరి చిత్రంలో క్రెగ్‌ ఎలా మెప్పించాడు?

కథేంటంటే: జేమ్స్‌ బాండ్‌(డేనియల్‌ క్రెగ్‌) తన ఉద్యోగం నుంచి పదవీ విరమణ తీసుకుని జమైకాలో ఎంజాయ్‌ చేస్తుంటాడు. అదే సమయంలో ఎంఐ6 లేబొరేటరీలో పనిచేసే శాస్త్రవేత్త ఓబ్రుచెవ్‌(డేవిడ్‌) అపహరణకు గురవుతాడు. ఓబ్రుచెవ్‌ ‘ప్రాజెక్టు హెర్క్యులెస్‌’ పేరుతో ఒక జీవాయుధాన్ని కనిపెడతాడు. ఆ ఆయుధంలో ఉండే నానో బోట్స్‌ వైరస్‌లాగా వ్యాప్తి చెందుతాయి. అది దుర్మార్గుల చేతిలో పడకుండా నిర్వీర్యం చేయాలంటే ఓబ్రుచెవ్‌ను కనిపెట్టాలి. శాస్త్రవేత్త కిడ్నాప్‌లో సాఫిన్‌(రామి మాలిక్‌) పాత్ర ఏంటి? మరి ఆ శాస్త్రవేత్తను బాండ్‌ ఎలా కనిపెట్టాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. అలాగే సాధారణ ప్రేక్షకులు కూడా ఈ ‘స్పై థ్రిల్లర్‌’లను చూసి ఆస్వాదిస్తుంటారు. ఇక బాండ్‌ చేసే సాహసాలకు యువత ఫిదా అవ్వాల్సిందే. అలా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నో టైమ్‌ టు డై’ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విజయం సాధించింది(Movie review). బాండ్‌ చిత్రం నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో దర్శకుడు జోజి ఫుకునాగా వాటన్నింటనీ మేళవించి ఈ సినిమాను తీర్చిదిద్దాడు. గత బాండ్‌ చిత్రాల మాదిరిగానే రొమాన్స్‌, యాక్షన్‌, నమ్మకద్రోహాలు ఇలా కథలో కావాల్సినంత డ్రామాను ప్రేక్షకులను అందించాడు దర్శకుడు.

‘అవెంజర్స్‌’ సిరీస్‌ మాదిరిగా గత బాండ్‌ చిత్రానికి ముడి పెడుతూ ‘నో టైమ్‌ టు డై’ను కొనసాగించాడు దర్శకుడు. అమ్మాయిలతో బాండ్‌ చేసే రొమాన్స్‌, సందడి ఒకవైపు చూపిస్తూనే, మరోవైపు శాస్త్రవేత్త అపహరణతో బాండ్‌కు టాస్క్‌ ఇచ్చేలా కథ కథనాలను నడిపించాడు. ఎప్పుడైతే బాండ్‌  టాస్క్‌లోకి దిగాడో అక్కడి నుంచి కథనం పరుగులు పెడుతుంది. బాండ్‌ క్యూబా వెళ్లడం, అపహరణకు గురైన శాస్త్రవేత్తను కనిపెట్టేందుకు ‘స్పెక్టర్‌’ టీమ్‌తో కలవడం తదితర సన్నివేశాలు ఆసక్తిగా సాగుతాయి. ‘సెక్టర్‌’ టీమ్‌పై దాడి జరగడంతో బాండ్‌ అతి కష్టంతో ప్రాణాలతో బయటపడతాడు. శాస్త్రవేత్త అపహరణ వెనుక సాఫిన్‌ ఉన్నాడన్న విషయం తెలుసుకున్న బాండ్‌ అతడి గతాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. అప్పుడు బాండ్‌కు ఎలాంటి నిజాలు తెలిశాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వాటిని తెరపై చూస్తే బాగుంటుంది. ప్రేక్షకులు ఆశించే రీతిలోనే పతాకసన్నివేశాలను హైవోల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో తెరకెక్కించారు. అయితే, క్లైమాక్స్‌ జీర్ణించుకోవడం కాస్త కష్టమే! ఎందుకో సినిమా చూస్తే తెలుస్తుంది.

ఎవరెలా చేశారంటే: ఎన్నో అడ్డంకులను దాటుకుని బాండ్‌ పాత్రను దక్కించుకోడం మామూలు విషయం కాదు. డేనియల్‌ క్రెగ్‌(Daniel Craig) ఒకటి, రెండు కాదు, ఏకంగా పదిహేనేళ్ల పాటు ఆ పాత్రలో నటించాడు.. కాదు.. జీవించాడనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఇక బాండ్‌గా చేయనని క్రెగ్‌ ముందే ప్రకటించాడు. ‘నో టైమ్‌ టు డై’తో క్రెగ్‌కు సరైన ముగింపు లభించింది. తనకు అచ్చి వచ్చిన బాండ్‌ పాత్రలో ఆయన అదరగొట్టారు. క్రెగ్‌కు ఈ చిత్రం సరైన ‘వీడ్కోలు’. ప్రతినాయకుడిగా రామి మాలెక్‌ పర్వాలేదనిపించాడు. అయితే, ఆయన పాత్రను అంత సమర్థంగా తీర్చిదిద్దలేదు. తర్వాతి బాండ్‌గా ప్రచారంలో ఉన్న లషనా లించ్‌, లియా సైడెక్స్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఈ సినిమాకు ప్రధాన బలం హన్స్‌ జిమ్మర్‌ నేపథ్య సంగీతం. ప్రేక్షకులను కథలో లీనం చేసింది. ఇంతకన్నా అద్భుతంగా మరో సంగీత దర్శకుడు నేపథ్య సంగీతం ఇవ్వడంటే అతిశయోక్తి కాదు. లైనస్‌ శాండ్రిగన్‌ సినిమాటోగ్రఫీ, గ్రాహమ్‌, టామ్‌ క్రాస్‌ ఎడిటింగ్‌ బాగా కుదిరాయి. అయితే సినిమా నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. దర్శకుడు క్యారీ జోజి ఫుకునాగా ‘నో టైమ్‌ టు డై’ను చక్కగా తీర్చిదిద్దాడు. బాండ్‌ సినిమాల నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలను మేళవించాడు. బాండ్‌గా చివరి చిత్రమైన డేనియల్‌ క్రెగ్‌(Daniel Craig)కు ఘనమైన వీడ్కోలు ఇచ్చాడు.

బలాలు

+ డేనియల్‌ క్రెగ్‌ నటన

+ యాక్షన్‌ సన్నివేశాలు

+ దర్శకత్వం, సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

- కాస్త పెరిగిన నిడివి

- అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం

చివరిగా: బాండ్‌ అభిమానులకు విజువల్‌ అండ్‌ ఎమోషనల్‌ ట్రీట్‌.. క్రెగ్‌కు ఘనమైన ‘వీడ్కోలు’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్