అవును, చాలా సంతోషంగా ఉంది: విద్యాబాలన్‌

విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో మొదటిసారిగా నటించిన లఘుచిత్రం ‘నట్‌ఖట్‌’. ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’కు నామినేట్‌ అయింది. ఈ నేపథ్యంలో ఆమె తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘అవును, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను భాగమైన..

Published : 08 Nov 2020 12:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో మొదటిసారిగా నటించిన లఘుచిత్రం ‘నట్‌ఖట్‌’. ఈ చిత్రం ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’కు నామినేట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో విద్యాబాలన్‌ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘అవును, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను భాగమైన ‘నట్‌ఖట్‌’ 3వ భారతీయ లఘుచిత్ర పురస్కారాలు 2020లో ప్రథమస్థానంలో నిలిచింది. అంతేకాదు.. ఎంతో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుకు కూడా అర్హత సాధించింది. నేను ఎంతో గర్వపడుతున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే విడుదలైన ‘నట్‌ఖట్‌’ అభిమానుల ప్రశంసలు పొందింది. 2020 ఉత్తమ భారతీయ లఘుచిత్రాల్లో అగ్రస్థానంలో నిలవడంతో నేరుగా ఆస్కార్‌ పురస్కారానికి అర్హత సాధించింది.

ఈచిత్రంలో సోనూ అనే ఆకతాయి బాలుడికి తల్లిగా, గృహిణిగా విద్యాబాలన్‌ కనిపించింది. మహిళలను చిన్నచూపు చూసే మగవాళ్లతో తిరగడం, వాళ్లలాగే మారి స్త్రీలతో తప్పుగా ప్రవర్తించడం వంటివి చేస్తున్న కొడుకును మంచి మనిషిలా మార్చుకోవాలనే తల్లి పాత్రలో విద్యాబాలన్‌ నటించింది. పితృస్వామ్య పోకడలు, లింగ వివక్ష, గృహహింసకు వ్యతిరేకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. విద్యాబాలన్‌ ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించారు. షాన్‌ వ్యాస్‌ దర్శకుడు. అనుకంప హర్ష్, శ్యామ్ వ్యాస్ కథ అందించారు. సహ నిర్మాతగా రోనీ వ్యవహరించారు. అల్లకల్లోలం సృష్టించిన 2020లోనూ ఒక శుభవార్త వినడం చాలా సంతోషంగా ఉందని విద్యాబాలన్‌ చెప్పారు. ఈ సినిమాతో నేను నటిగానే కాకుండా తొలిసారిగా నిర్మాతగానూ వ్యవహించే అవకాశం వచ్చిందని ఆమె పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని