Enemy: వాళ్ల బాధ్యత నాది : విశాల్‌

‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ మంచి నటుడే కాదు.. గొప్ప మనిషి కూడా. ఓ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఆయన చేశారు. 1800 మంది పిల్లల్ని చదివిస్తున్నారు. పునీత్‌ స్నేహితుడిగా ఇప్పుడు ఆయనకు నేను

Updated : 02 Nov 2021 12:24 IST

‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ మంచి నటుడే కాదు.. గొప్ప మనిషి కూడా. ఓ ప్రభుత్వం చేయాల్సిన పనిని ఆయన చేశారు. 1800 మంది పిల్లల్ని చదివిస్తున్నారు. పునీత్‌ స్నేహితుడిగా ఇప్పుడు ఆయనకు నేను చేయగలిగేది ఒకటే. ఇకపై ఆ 1800 మంది పిల్లల బాధ్యతను నేనే తీసుకుంటాను. వారికి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను’’ అన్నారు హీరో విశాల్‌. ఆయన, హీరో ఆర్య కలిసి నటించిన చిత్రం ‘ఎనిమి’. ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కించారు. ఎస్‌.వినోద్‌ నిర్మించారు. మమతా మోహన్‌దాస్‌, మృణాళిని కథానాయికలు. ఈ సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా విశాల్‌ మాట్లాడుతూ ‘‘వినోద్‌ లేకుంటే ఈ ‘ఎనిమి’ లేదు. తను కథ చెప్పినప్పుడే మరో పాత్ర ఆర్య చేస్తేనే బాగుంటుందని అనుకున్నా. ఇదొక విభిన్నమైన యాక్షన్‌ సినిమా. చాలా బాగా వచ్చింది. సినిమాలో నాది మృణాళిని కెమిస్ట్రీ కన్నా.. నాది ఆర్యలదే బాగా వచ్చింది. థియేటర్లలో సినిమా చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘మంచి స్టోరీ ఇది. ఎమోషన్స్‌ ఉన్నాయి. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరం. ‘వాడు వీడు’ తర్వాత మళ్లీ ఇలా ఈ చిత్రంతో విశాల్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ఆర్య. దర్శకుడు ఆనంద్‌ మాట్లాడుతూ ‘‘ఇది చక్కటి వాణిజ్య చిత్రం. అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రం కోసం ఆర్య, విశాల్‌ కలిసి నటించేందుకు ముందుకు రావడం చాలా గ్రేట్‌. యాక్షన్‌ సీక్వెన్స్‌లో ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు’’ అన్నారు. ‘‘కొవిడ్‌ పరిస్థితుల వల్ల దుబాయ్‌లో షూట్‌ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఫస్ట్‌లుక్‌ విడుదలైనప్పటి నుంచి అండగా నిలుస్తున్న అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో మమతా మోహన్‌దాస్‌, మృణాళిని తదితరులు పాల్గొన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని