Akhil: ఆ ఆత్మవిమర్శ నుంచి పుట్టిందే ఏజెంట్‌

‘‘నా సినిమా చూడ్డానికి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు ఏదో గొప్పగా చూపించాలి. అలాంటి కథ దొరికినప్పుడు ఆ సినిమా చేయడానికి రెండేళ్లు పట్టినా ధైర్యంగా చేస్తాను’’అంటున్నారు యువ కథానాయకుడు అఖిల్‌.

Updated : 23 Apr 2023 12:34 IST

ఎందుకో తెలియదు యాక్షన్‌ చిత్రాలంటే పిచ్చి నాకు

‘‘నా సినిమా చూడ్డానికి థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు ఏదో గొప్పగా చూపించాలి. అలాంటి కథ దొరికినప్పుడు ఆ సినిమా చేయడానికి రెండేళ్లు పట్టినా ధైర్యంగా చేస్తాను’’అంటున్నారు యువ కథానాయకుడు అఖిల్‌ (Akhil). సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’ (Agent). ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రం 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అఖిల్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘తొలి లాక్‌డౌన్‌ సమయంలో ‘ఏజెంట్‌’ ప్రయాణం మొదలైంది. చిన్నప్పటి నుంచీ నాకు యాక్షన్‌ సినిమాలంటేనే ఇష్టం. అందుకే రాజమౌళి సినిమాలంటే చాలా పిచ్చి. యాక్షన్‌ చిత్రాలపై ఆ ఇష్టం ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఆ జోనర్‌లో భారీ స్థాయిలో కొత్తగా ఏదో చేయాలనిపిస్తుంటుంది. నిజం చెప్పాలంటే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమా చేస్తున్నప్పుడే నేను ఇంకా ఏదో చేయాలి అనిపించేది. అలాగని ఆ సినిమాని తక్కువ చేయడం లేదు. ఆ కథ వరకూ ఆ సినిమా చాలా బాగుంటుంది. ఆ సమయంలో ఆత్మవిమర్శ చేసుకున్నాను. అప్పుడు ఎలాంటి జోనర్‌ యాక్షన్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నప్పుడు సురేందర్‌రెడ్డిని కలిశాను. అందరికీ నేనేంటో తెలిసేలా ఏదో చేయాలనుకున్నప్పుడు ‘స్పై’ కథ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. అలా పుట్టిందే ‘ఏజెంట్‌’

ఓర్పు అంటే నేర్పింది

‘‘ఏజెంట్‌’లో నా దేహాకృతి అనేది చాలా కీలకమైన అంశం. నా గత చిత్రానికి భిన్నంగా పూర్తిగా నా దేహం మారితేనే కథకు సరిపోతానని సూరి చెప్పారు. ఓ నాలుగు నెలల్లో ఆ దేహాకృతి వచ్చేస్తుంది అనుకున్నాను. కానీ ఆ ఆకృతి రావడానికి ఏకంగా పది నెలలు పట్టింది. అప్పుడు తొలి సన్నివేశం తీశారు. ఆలస్యమైన నేను పడిన కష్టం తెరపై కనపడుతుంటే చాలా సంతోషంగా ఉంది. సూరి కథ చెప్పినపుడు చాలా బాగా నచ్చింది. నేను చేయగలనా అనుకున్నాను. ఇందులో నన్ను దారుణంగా హింసించే ఓ సన్నివేశం ఉంటుంది. అదైతే చేయగలనా అనుకున్నాను. కానీ చివరకు చేశాను. ఈ సినిమా ప్రయాణం ఓర్పుగా ఉండటం ఎలాగో నేర్పించింది.’’

ఆ సెంటిమెంట్లు లేకపోయినా

కొత్త అమ్మాయి అయినా సాక్షి వైద్య చాలా బాగా నటించింది. ఫలానా రోజు నా సినిమా విడుదల కావాలి లాంటి సెంటిమెంట్లు నాకు ఉండవు. కానీ ఈ సినిమా నాకు ఎంతో ఇష్టమైన ‘పోకిరి’, ‘బాహుబలి 2’ విడుదలైన రోజే రావడం మాత్రం సంతోషంగా ఉంది.

మమ్ముట్టి ఒప్పుకున్నప్పుడే అర్థమైంది

‘‘ఈ చిత్రం గతంలో వచ్చిన స్పై చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. మమ్ముట్టి లాంటి స్టార్‌ హీరో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారంటేనే అర్థమవుతుంది ఈ కథ ఆయనకు ఎంతగా నచ్చిందో. తొలి రోజు సెట్లో ఆయనతో ఓ సీన్‌ చేసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన నిబద్ధత, అంకిత భావం చూసి చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాని నేను ఇంత బాగా పూర్తి చేశానంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం కూడా ప్రధాన కారణమే. కేవలం ఇది హీరో ఆధారంగా నడిచేది కాదు. ముగ్గురి పాత్రల ప్రధానంగా సాగుతుంది. ఈ సినిమా కోసం...ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల కోసం పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. ఆ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. స్పై జోనర్‌ కాబట్టి కాస్త సీరియస్‌గా ఉంటుంది. కానీ కథలో అంతర్భాగంగా చక్కటి వినోదం కూడా ఉంటుంది.  కథానాయకుడి పాత్ర ద్వారానే హాస్యాన్ని అందించారు దర్శకుడు’’


నాన్నతో పంచుకోలేదు

నిజం చెప్పాలంటే నాన్నతో ‘ఏజెంట్‌’ స్క్రిప్ట్‌ గురంచి చెప్పలేదు. ఎందుకంటే నా జయాపజయాలకు నేను తీసుకునే నిర్ణయాలే కారణం కావాలనుకుంటాను. ఎంత కాలం నాన్నపై ఆధారపడతాను. నాకు నేను సొంతంగా నిర్ణయాలు తీసుకుంటేనే కదా ఎదిగేది. నాన్న నుంచి సలహాలు తీసుకుంటాను. నిర్ణయాలు నేనే తీసుకుంటాను. అన్నయ్య, నేను కూడా ప్రతి విషయం గురించి మాట్లాడుకుంటాం.


100వ సినిమా ఇంకా నిర్ణయం కాలేదు

‘‘జూన్‌లో మరో కొత్త సినిమా మొదలుపెడతాను. నాన్న 100వ సినిమాకు సంబంధించి ఇంకా ఏదీ కన్ఫార్మ్‌ కాలేదు. నాన్నతో చేయడం గొప్పకల. మరి అలాంటి సినిమా చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. అందుకే దానికి తగ్గట్టు కథ వెతుకుతున్నాం. యాక్షన్‌ చిత్రాల్లోనే ఇంకా రకరకాల ఎమోషన్స్‌ ఉన్నవి చేయాలి. ఈ సినిమా తర్వాత వరసగా నాలుగు యాక్షన్‌ చిత్రాలు చేయడానికి కూడా నేను సిద్ధం’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని